పుణ్యక్షేత్రంలో బార్ పెట్టకపోతే ఏమవుతుంది సారూ?

Update: 2021-02-09 07:12 GMT
తిరుమలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో యాదగిరి గుట్టను మారుస్తానని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తగ్గట్లే.. యాదాద్రి పేరుతో భారీ ఎత్తున నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ పుణ్య క్షేత్రాన్ని భారీ ఎత్తున ప్రారంభించటానికి కసరత్తు చేస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని యాదాద్రిగా పేరు మార్చటం తెలిసిందే. కట్ చేస్తే.. తాజాగా మరో ఆసక్తికర సమాచారంతో వార్తల్లోకి వచ్చింది యాదగిరి గుట్ట.

సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం యాదాద్రిలో బార్ ను ఏర్పాటు చేయటానికి భారీగా పోటీ నెలకొని ఉంది. పెద్ద ఎత్తున యాత్రికులు వచ్చే అవకాశం ఉండటంతో.. ఇలాంటి ప్లేస్ లో బార్ ఏర్పాటు చేస్తే వ్యాపారం మస్తుగా సాగుతుందన్న అంచనాలే.. ఈ భారీ పోటీకి కారణమని చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్త బార్ల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానించారు. కరోనా నేపథ్యంలో పెద్దగా స్పందన ఉండదని భావించిన అధికారులకు షాకిస్తూ.. భారీగా అప్లికేషన్లు వచ్చాయి.

అన్నింటికి మించిన ాశ్రర్యం ఏమంటే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 బార్ల కోసం 640 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఒక్క యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసే బార్ కోసం 280 మంది పోటీ పడుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికమని చెబుతున్నారు. అయినా.. పుణ్యక్షేత్రంలో బార్ ఏర్పాటు చేయకపోతే ఏమవుతుంది. పుణ్యక్షేత్రంలోనే కాకున్నా.. దానికి దగ్గర్లోనూ బార్ ఏర్పాటు చేయటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. పరమభక్తుడైన ముఖ్యమంత్రి వారికి ఈ చిన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు?

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు భారీగా స్పందన నెలకొంది. 159 బార్ల కోసం ఏకంగా 7360 దరఖాస్తులు రావటం గమనార్హం.నల్గొండ జిల్లాలో 6 బార్లకు 638 దరఖాస్తులు వచ్చాయి. అదే సమయంలో నిజామాబాద్ జిల్లాలో మాత్రం తక్కువ స్పందన నెలకొంది. అక్కడ ఏర్పాటు చేసే 12 బార్లకు కేవలం 59 దరఖాస్తులే వచ్చాయి. ఇక.. బోధన్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసే మూడు బార్లకు మూడే దరఖాస్తులు రావటం చూస్తే.. లెక్క ఎక్కడో.. ఏదో తేడా కొట్టినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News