జగన్ గెలుపును ఏవి ప్రభావితం చేస్తాయి? ఏవి రక్షిస్తాయి?

Update: 2023-01-20 02:30 GMT
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉంది. ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈసారైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు కత్తులు నూరుతున్నాయి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అటు చంద్రబాబు.. ఇటు పవన్ ప్రజలకు చేతులు జోడిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంతో ప్రజలు నష్టాల పాలవుతున్నారని, తాము అధికారంలోకి వస్తే స్వర్ణయుగం చూపిస్తామని అంటున్నారు. అటు అధికార పార్టీ సైతం వచ్చే ఎన్నికలపై ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోంది. 2019లో లాగే 2024లో తమకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వెళ్లేసరికి ఆ పరిస్థితి వేరుగా ఉందని తెలుస్తోంది. సంక్షేమ పథకాల విషయంలో జగన్ సర్కారుపై ఓ వర్గం సంతృప్తిగా ఉన్నా.. చాలా వరకు వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు జగన్ ను గెలుపును ఏవి ప్రభావితం చేస్తాయి? ఏవి రక్షిస్తాయి? అనేది చూద్దాం..

వైసీపీ అధికారంలోకి రాకముందు జగన్ పాదయాత్ర చేశారు. ఊరూరా తిరుగుతూ నేను విన్నాను.. ఆ తరువాత చేస్తాను.. అంటూ వారికి భరోసా ఇచ్చారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చాక నవరత్నాలను ప్రవేశపెట్టారు.  ప్రతీ పేదవాడికి సంక్షేమమే తన లక్ష్యమంటూ వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. దళారుల సమస్య లేకుండా నేరుగా వారి అకౌంట్లోకే డబ్బులు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఓ వర్గం ఫుల్ హ్యపీగా ఉంది. బట్టా, పొట్టకు కొరత లేకుండా డబ్బులు పడుతున్నాయి. అయితే ఇలా లబ్ధి పొందిన ప్రతీ ఒక్కరు మళ్లీ జగనన్న రావాలని కోరుకుంటారా..?

ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన మహామహులు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అయితే పేదవారికి అవసరమైన సౌకర్యాలను వారు కల్పించారు. టీడీపీ హయాంలో రూ.2 కే కిలో బియ్యం, పక్కా గృహాలు నిర్మించి పెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఇందిరమ్మ ఇల్లు, 108 అంబులెన్స్, ఆరోగ్య శ్రీ,, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాలు ప్రవేశపెట్టారు. ఇవి వారికి ఎంతో ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పటి వరకు ఎవరూ నేరుగా అకౌంట్లో డబ్బులు పడే పథకాలు ప్రవేశపెట్టలేదు. దీంతో పేదలు తమ అవసరాలు తీర్చారని నాయకులను గుండెల్లో పెట్టుకున్నారు. అందువల్లే వారు రెండు, మూడు సార్లు అధికారంలోకి రాగలిగారు.

అయితే ఇప్పుడు బటన్ నొక్కడం ద్వారా ప్రజలకు నేరుగా లక్షల రూపాయలు వారికి అందుతున్నాయ. కానీ వారు తమకు డబ్బులు వచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకుంటారా..? అంతేకాకుండా జగన్ సర్కార్ ఓ వైపు డబ్బులు పంచుతూ మరో రకంగా లాగుతున్నారనే ప్రచారం ప్రజల్లో పాతుకుపోతుంది. ఈ సమయంలో జగన్ ఇచ్చే డబ్బులు తమ హక్కుగా భావిస్తే.. ఏ ప్రభుత్వం అయినా ఇలాగే చేస్తుందనే భావన వారిలో ఉంటుంది. దీంతో వ్యక్తిని పెద్దగా పట్టించుకునే అవసరం ఉండదు.

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని జగన్ ధీమాతో ఉన్నారు. కొంచెం అటూ ఇటూ అయినా సంక్షేమం పొందిన వారు కొన్ని సీట్లు తీసుకు రావచ్చు. కానీ ఒకటో తారీఖు జీతాలు రానీ ఉద్యోగుల లాంటి వారు జగన్ సర్కార్ పై అసంతృప్తిగా ఉంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో అనుకున్న సీట్లు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికే ప్రతిపక్షాలు  ప్రభుత్వం సంక్షేమం పేరిట ప్రజా ధనాన్ని వృథా చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి.. విభజన సమస్యలు తొలిగిపోలేదు.. ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ ను ఆదరిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News