బీజేపీకి ఈ మాజీ ముఖ్యమంత్రితో ప్రయోజనం ఎంత?

Update: 2023-04-08 15:08 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎట్టకేలకు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ బీజేపీ కోసం పార్టీలో చేరారా? లేక ఏపీ బీజేపీ కోసం పార్టీలో చేరారా అనేదానిపై చర్చ జరుగుతోంది.

పార్టీలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేరిక సందర్భంగా కేంద్ర బీజేపీ నేతలు ఆయన ప్రభావం ఏపీతో పాటు తెలంగాణలోనూ ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు అంత సీన్‌ ఉందా అనేదానిపై నెటిజన్లలో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నేతలు కిరణ్‌ పైన, బీజేపీపైన విమర్శలు మొదలుపెట్టారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బీజేపీ తనలో చేర్చుకుందని విమర్శలు సంధిస్తున్నారు.

కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏపీలో క్రియాశీలక పాత్ర పోషించడానికి ఏమీ లేదని అంటున్నారు. ఎందుకంటే బీజేపీ పరిస్థితి ఏపీలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని చెబుతున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అద్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. పవన్‌ కల్యాణ్‌ చరిష్మా పైనే బీజేపీ ఏపీలో ఆధారపడింది.

ప్రస్తుతం ఏపీ బీజేపీలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి వంటి నేతలు ఉన్నా వీరంతా కేసుల భయంతోనే బీజేపీలో చేరారనే టాక్‌ ఉంది. ఏపీలో బీజేపీకి ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ కూడా లేరు. వచ్చే ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న అంచనాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏపీ బీజేపీలో ఉంటే ఆయన కు ఒరిగే ప్రయోజనం ఏముందనే చర్చ జరుగుతోంది.

అందులోనూ ఏపీలో కిరణ్‌ తమ్ముడు నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి పీలేరు టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన కిషోర్‌ కుమార్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగనున్నారు, తాజాగా ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా నారా లోకేష్‌ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఒక పార్టీలో, ఆయన అన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఒక పార్టీలో ఉండటం కూడా మైనస్సేనని అంటున్నారు.

ఇక తెలంగాణలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్‌ రావు, కిషన్‌ రెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, జితేందర్‌ రెడ్డి వంటి బలమైన నేతలు బీజేపీలో ఉన్నారు. వీరిని మించిన టాకింగ్‌ పవర్‌ కానీ, మాస్‌ ఇమేజ్‌ కానీ కిరణ్‌ కుమార్‌ రెడ్డికి లేవని అంటున్నారు. అంతమంది తెలంగాణ బీజేపీ నేతలు ఉండగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి వల్ల తెలంగాణ బీజేపీకి వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదని ప్రచారమే సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News