ప‌ల్లం రాజు ప్ర‌యాణ‌మెటు?

Update: 2021-10-26 23:30 GMT
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు క‌నుమ‌రుగై పోయారు. కొంత‌మంది ఏకంగా రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నారు. మ‌రికొంత మంది ఏ పార్టీలోనూ ఇమ‌డ‌లేక సైలెంట్‌గా ఉండిపోయారు. అలాంటి సీనియ‌ర్ నాయ‌కులు ఇప్పుడు ఏపీలో జ‌రిగే 2024 ఎన్నిక‌ల్లో పోటీకి దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అందులో ప‌ల్లం రాజు కూడా ఒక‌రు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్ హ‌యాంలో కేంద్ర మంత్రిగా ప‌ని చేసిన సీనియ‌ర్ నేత ప‌ల్లం రాజు. త‌న రాజ‌కీయ జీవితంలో ఆరంభం నుంచి ఆయ‌న కాంగ్రెస్‌తోనే ఉన్నారు. కాకినాడ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు. 1989, 2004, 2009 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న కుటుంబం సుదీర్ఘ కాలం నుంచి రాజ‌కీయాల్లో ఉంది. విదేశాల్లో కొద్దికాలం ఉండి ఆ త‌ర్వాత స్వ‌దేశం వ‌చ్చి రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన ప‌ల్లం రాజుకు ప్ర‌జ‌ల అండ‌గా నిలిచారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఏపీలో 2024 ఎన్నిక‌ల్లో ఆయ‌న తిరిగి పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏ పార్టీలో చేర‌తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ఆయ‌న‌కు ఇటు టీడీపీ నుంచి అటు జ‌న‌సేన నుంచి ఆహ్వానాలు అందాయి. గ‌తంలో ఆ పార్టీలో ఉన్న చెల‌మ‌ల శెట్టి సునీల్ ప్ర‌స్తుతం వైసీపీలో కొన‌సాగుతున్నారు. కాకినాడ లోక్‌స‌భ స్థానానికి పోటీ చేసేందుకు టీడీపీకి స‌రైన అభ్య‌ర్థులు లేరు. తోట న‌ర‌సింహం కుటుంబం కూడా పార్టీని వీడింది.

ఈ నేప‌థ్యంలో ప‌ల్లం రాజును పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ప్రయ‌త్నిస్తోంది. మ‌రోవైపు జ‌న‌సేన కూడా అదే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌కీయంగా మంచి పేరున్న ఆ కుటుంబాన్ని పార్టీలో చేర్చుకోవాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. స్వ‌యంగా ప‌వ‌నే ప‌ల్లం రాజును క‌ల‌వాల‌నుకుంటున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ప‌ల్లం రాజు కూడా ఈ రెండు పార్టీలో ఏదో ఒక‌దానిలో చేరే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఆయ‌న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండ‌లేరు. వైసీపీలోకి వెళ్ల‌లేరు. అందుకే డీఎల్ రవీంద్రారెడ్డి లాగే ఆయ‌న కూడా కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీలో చేరి పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. మ‌రి ఏ పార్టీలో ఆయ‌న చేర‌తారో అన్న‌ది వేచి చూడాలి.




Tags:    

Similar News