టీడీపీతో పవన్...రాజకీయ లాభమెంత... ?

Update: 2021-11-27 12:30 GMT
పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్టార్. ఆయన వెండి తెర మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయి. ఇక రాజకీయ సభల్లో పవన్ మాట్లాడుతూంటే ఆయన ఏం చెబుతున్నారు అన్న దాని కంటే కూడా ఆయన ప్రెజెన్స్ నే ఎంజాయ్ చేసే వీర లెవెల్ ఫ్యాన్స్ ఏపీ నిండా కనిపిస్తారు.

అంటే పవన్ ఏపీ పాలిటిక్స్ లో చూసుకుంటే అతి పెద్ద క్రౌడ్ పుల్లర్. అందులో రెండవ మాటకు తావు లేదు. ఇక యూత్ ని అట్రాక్ట్ చేసే లీడర్ గా కూడా పవన్ పేరే ముందు చెప్పుకోవాలి. దీనికి తోడు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా పవన్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

దాంతో పవన్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓడినా కూడా ఈ రోజుకీ ఏపీలో రాజకీయాలు చేయగలుగుతున్నారు. ఆయనని పక్కన పెట్టి రాజకీయాలు చేసే సీన్ ఎవరికీ లేనిది కూడా అందుకే.

మరి పవన్ 2014 ఎన్నికల్లో టీడీపీకి బాగా ఉపయోగపడ్డారు. పూర్తిగా ఆయన వల్ల అని చెప్పకపోయినా వైసీపీతో ఢీ కొట్టే సీన్ ఉన్నఆంధ్రా రాజకీయాల్లో పవన్ తులసీదళం మొగ్గు టీడీపీని ఎపుడూ కాపాడుతూ వస్తోంది అంటారు. ఇక 2019 నాటికి పవన్ వేరుగా పోటీ చేయడం వల్లనే వైసీపీకి 151 సీట్ల బంపర్ మెజారిటీ వచ్చింది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

మళ్లీ 2024 నాటికి పవన్ టీడీపీ కలసిపోతే ఏపీ రాజకీయ చిత్రం ఎలా ఉంటుంది. వైసీపీకి పరాజయమేనా, టీడీపీకి అధికారం కచ్చితంగా దక్కుతుందా అంటే ఇది పక్కా క్లారిటీగా ఎవరూ చెప్పలేని స్థితి.

ఎందుకంటే ఇది రాజకీయం. 2014లో జరిగింది అని 2024లో అదే జరగాలని లేదు. ఈ మధ్యలో పదేళ్ళ కాలం గడచింది. ఎన్నో మార్పులు పరిణామాలు జరిగాయి. అందువల్ల పవన్ తో జట్టు కడితే విజయం ఖాయమని టీడీపీ నేతలు ధీమాగా చెప్పుకోలేని స్థితి ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి.

ముందుగా జనసేన గురించి చెప్పుకోవాలి అంటే ఈ రోజుకీ ఆ పార్టీకి సరైన నిర్మాణం లేదు. అదే సమయంలో పవన్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తారన్న పేరు అలాగే ఉంది. పవన్ 2014 నాటికి కొత్త కానీ 2024 నాటికి అందరి లాంటి రొటీన్ నాయకుడే అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది.

ఇక ఆనాడు టీడీపీ గెలవడానికి చంద్రబాబు ఇచ్చిన అభివృద్ధి నినాదం, మోడీ ప్రధాని అభ్యర్ధిగా దేశమంతా ఫీవర్ తో ఊగిపోయిన నేపధ్యం కూడా ఎంతగానో దోహపడ్డాయి. ఇక 2024 కి వచ్చేసరికి విభజన ఏపీకి అయిదేళ్ల పాటు సీఎం గా పనిచేసిన అనుభవం కూడా జనం కళ్ల ముందు ఉంటాయి.

ఇక పవన్ పొత్తుల పేరిట పార్టీలను మార్చిన చరిత్ర కూడా కదలాడుతూ ఉంటుంది. బీజేపీతో పొత్తు ఉంటే విభజన హామీలను తుంగలోకి తొక్కిన కోపం కూడా అలాగే ఉంటుంది. మరి ఈ కూటమి గెలవాలి అంటే అది వైసీపీ చేతిలోనే ఉంది. వైసీపీ వైఫల్యాలు కనుక గట్టిగా ఉంటే చంద్రబాబు అయిదేళ్ల పాలనే జగన్ కంటే నయం అని జనాలు అనుకుంటేనే కూటమి విజయం సాధ్యం.

అయితే ఇపుడు జనాలు పాలనను చూసి నిర్ణయించి ఓట్లు వేస్తున్నారా అంటే అది నూరు శాతం కరెక్ట్ కాదు, దాంతో పాటు సంక్షేమ పధకాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో చూడాలి, ఇక పవన్ టీడీపీ వెంట వచ్చినా పూర్తి స్థాయిలో కాపులు ఆయనతో నడుస్తారు అన్న గ్యారంటీ అయితే లేదు.

పవన్ టీడీపీ కలిస్తే బీసీలు మాత్రం ఇంకా దూరం అవడం ఖాయమన్న భయాలు కూడా పసుపు పార్టీలో ఉన్నాయట. జగన్ బీసీల ఓట్లను పెద్ద ఎత్తున కన్సాలిడేట్ చేస్తున్నారు. వారికి పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులతో పాటు బీసీ ల జనగణన తీర్మానం వెనక ఉద్దేశ్యం అదే. అంటే టీడీపీకి కాపుల మద్దతు పూర్తిగా దక్కపోవచ్చు. అదే టైమ్ లో బ్యాక్ బోన్ లాంటి బీసీలు టీడీపీకి దూరమైతే 2024లో ఇబ్బందే అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి వీటన్నిటికీ మించిన‌ ఎమోషనల్ ఇష్యూస్ ని రగిలించినపుడే టీడీపీకి అడ్వాంటేజ్ అన్న మాట అయితే ఉంది.
Tags:    

Similar News