జీతాలను వ్యతిరేకిస్తున్న కారణమిదేనా ?

Update: 2022-01-28 04:42 GMT
 కొత్త పీఆర్సీ ప్రకారం అందుకోబోయే జీతాలను ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వమేమో మొదటి నెల జీతం తీసుకున్నాక జీతం పెరిగిందో తగ్గిందో చూసుకుని అప్పుడు మాట్లాడమని పదే పదే చెబుతోంది. అయినా సరే ఉద్యోగుల నేతలు చీఫ్ సెక్రటరీ చెప్పిన మాటను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలంటు డిమాండ్ చేస్తున్నారు.

అసలు ప్రభుత్వం చెప్పినట్లు మొదటి నెల జీతం తీసుకుంటేనే కదా తెలుస్తుంది జీతం పెరిగిందో తగ్గిందో అర్ధమయ్యేందుకు అనేదే చర్చంతా. పీఆర్సీ వివాదంపై గెజిటెడ్ అధికారుల సంఘం కోర్టులో కేసు వేసినపుడు విచారణలో జడ్జీ కూడా ఇదే విషయాన్ని అడిగారు. దానికి పిటీషనర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు.

అసలు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తీసుకునేందుకు ఉద్యోగ నేతలు ఎందుకని వ్యతిరేకిస్తున్నారు ?  ఎందుకంటే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరిగే మాట వాస్తవం.

పాత పీఆర్సీలో ఫిట్మెంట్+హెచ్ఆర్ఏ+సీసీఏలున్నాయి. అదే కొత్త పీఆర్సీలో పిట్మెంట్+తగ్గిన హెచ్ఆర్ఏ+5 ఏడీలున్నాయి. అంటే కొత్త పీఆర్సీలో హెచ్ఆర్ఏ తగ్గినా, సీసీఏ రద్దయినా  5 డీఏలు కలవటంతో జీతంలో పెరుగుదల కనిపిస్తుంది. కాబట్టే ఇలాంటి పెరుగుదల తమకు వద్దని ఉద్యోగుల నేతలంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఏ రూపంలో జీతం పెరిగితే ఏముంది, మొత్తం మీద చేతికి ఎంత వస్తోందన్నదే ముఖ్యం కదాని ప్రశ్నిస్తోంది. కోర్టు కూడా ప్రభుత్వ వాదననే సమర్ధించింది.

ఇక్కడ సమస్య ఏమిటంటే మొదటి నెల జీతం చేతికి వస్తే జీతంలో పెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి చాలామంది ఉద్యోగులు ఏదోరూపంలో జీతం పెరిగింది కదా ఇంకా సమ్మెందుకు అనే అవకాశముంది. ఒకవేళ మెజారిటీ ఉద్యోగుల్లో ఇదే భావన మొదలైతే తమను ఎవరు పట్టించుకోరనేది ఉద్యోగ నేతల ఆందోళన. చాలామంది ఉద్యోగులకు పీఆర్సీ లెక్కలు సక్రమంగా అర్ధం కావు. నెలాఖరులో తమకు జీతం పెరిగిందా ? తగ్గిందా ? అని మాత్రమే చూసుకుంటారు.

తమ జీతం పెరిగిందని అనుకుంటే చాలా మంది ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉంటారు. అందుకనే ఉద్యోగనేతలు కొత్త పీఆర్సీ ప్రకారం తమకు జీతాలు వద్దంటు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రభుత్వం ఏమో జీతాలు వేసేస్తే ఉద్యోగుల ఆలోచనలో మార్పొస్తుందని అనుకుంటోంది. మరి చివరకు నెల చివరి మూడు రోజుల్లో  ఏమవుతుందో ఏమో చూడాలి.
Tags:    

Similar News