‘ఇదేంటి మోడీజీ?’.. సోషల్ మీడియాలో వైరల్

Update: 2021-10-11 07:55 GMT
అప్పు చేసి పప్పు కూడు అంటారు. కానీ అప్పు చేసినా ఇప్పుడు దేశంలో బుక్కెడు బువ్వ దొరకదు అంటున్నారు. గత కాంగ్రెస్ పాలనకు.. నేటి మోడీ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నాడు కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో ఆర్నెళ్లకో ఏడాదికో పెట్రోల్ రేటు పెంచితే రోడ్డెక్కి నానా యాగీ చేసే ప్రతిపక్షాలను , ప్రజలను చూశాం.. కానీ ఇప్పుడూ మోడీ సార్ రోజు పెట్రోల్ వాతలు పెడుతుంటే చేష్టలుడి చూస్తున్నాం.. ప్రశ్నించినవాడిని ‘దేశద్రోహి’ అని ముద్ర వేస్తే కిక్కురుమనకుండా పడి ఉంటున్నాం.. మోడీ సార్ ‘దేశ భక్తి’ పేరిట జనాల నడ్డి విరుస్తున్నా కూడా నెత్తినోరు బాదుకుంటూ మౌనం వహిస్తున్నామన్న ఆవేదన సగటు ప్రజల్లో వ్యక్తమవుతోంది.

మోడీ సర్కార్ లో కాదేది పెంచడానికి అనర్హం అన్నట్టుగా తయారైంది.  అగ్గిపుల్ల సబ్బుబిల్ల, గ్యాస్ బండ, పెట్రో మంట, నిత్యావసరాల తంటా.. ఇలా  దేశమంతా ఇప్పుడు ఒకటే బాదుడు.. ఉప్పు పప్పు లాంటి నిత్యావసరాల నుంచి పెట్రోల్, నూనెలు, పాలు, ఆఖరుకు కోడిగుడ్లు సైతం ప్రియ అయిన పరిస్థితి నెలకొంది.  కరోనా కల్లోలంతో ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా మోడీ సార్ వీర బాదుడు బాదేస్తున్నాడు. సామాన్యుడి నడ్డి విరిచేలా ధరలు పెంచేస్తున్నాడు.

మోడీ ధరల బాదుడుకు సామాన్యులు విలవిలాడుతున్నారు. పెట్రోల్ ధరలు రూ.100 దాటేసి పరుగులు తీస్తుండడం.. వంట నూనె 150 దాటడం.. ఇక వంట గ్యాస్ సిలిండర్ 1000కి చేరడం జరిగిపోయింది. దేశప్రజలంతా మొత్తుకుంటున్నా కూడా ధరలను తగ్గించేందుకు మోడీ సార్ అస్సలు సాహసించడంలేదు. ముఖ్యంగా సామాన్యుడికి నిత్య అవసరం అయిన పెట్రోల్ రేటు రూ.100 దాటి పెరుగుతున్నా సప్పుడే లేదు. ధరాఘాతంతో ప్రజల జేబును ఖాళీ చేసేలా ఈ పెట్రో ధరలు తయారయ్యాయి.

ఈ క్రమంలోనే పెట్రోల్ పై భారత, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు తగ్గించాలనే డిమాండ్ మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ధరలు ఇండియాలోనే అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. వివిధ దేశాల పెట్రోల్ ధరలను వేలెత్తిచూపిస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ‘ప్రపంచంలోనే అత్యంత తక్కువగా రూ.1.45కే లీటర్ పెట్రోల్ అమ్ముతున్న దేశం ‘వెనిజుల’ అని అక్కడికి పదండి ముందుకు అని సోషల్ మీడియాలో మీమ్స్ తయారు చేస్తున్నారు.‘రూ.500 పట్టుకెళ్లి ట్యాంకు ఫుల్ గా ’ పెట్రోల్ తెచ్చుకుందాం అని సెటైర్లు వేస్తున్నారు.

ఇక భారత్ లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధరలు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఎంతున్నాయనే దానిపై లెక్కలు తీసి మరీ కడిగేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్రోల్ రేటు రూ.60 ఉండగా.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో అది రూ.112కు చేరింది. ఇక డీజిల్ గతంలో రూ.55 ఉండగా.. రూ.100కు చేరింది.  ఇక గ్యాస్ సిలిండర్ ధర రూ.414 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.1000కి చేరువైంది. పెసరపప్పు నాడు రూ.70కి కిలో దొరకగా.. నేడు అది రూ.190కి పెరిగింది. గోధమపిండి నాడు రూ.17 ఉండగా.. నేడు రూ.30 అయ్యింది. నెయ్యి రూ.350 ఉండగా.. ఇప్పుడు డబుల్ పెరిగి 650 అయ్యింది. వంట నూనె నాడు రూ.52కే దొరకగా.. ఇప్పుడు రూ.210కి చేరింది. పాలు రూ.30 ఉండగా 56 అయ్యింది. కోడి గుడ్డు కాంగ్రెస్ హయాంలో రూ.2 ఉండగా.. రూ.7కు పెరిగింది..

ఇలా మోడీ సర్కార్ హయాంలో కాదేది పెంపుకు అనర్హం అన్నట్టుగా తయారైంది. దాదాపు ప్రతి వస్తువు డబుల్ అయిన పరిస్థితి. పెట్రోల్ రేట్లకు పట్టపగ్గాల్లేకుండా పెరిగుతున్న దుస్థితి నెలకొంది. ప్రతిదీ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే విధంగా భారీగా పెరిగాయి. నిత్యావసరాలు కొనలేక ప్రజలు ఈ కరోనా కల్లోలంలో ఆపసోపాలు పడుతున్న పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News