ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు వస్తే ఏం చేయాలి?

Update: 2022-05-02 06:27 GMT
ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి చూపు ఎలక్ట్రికల్ వాహనాల (ఈవీ) మీద పడుతోంది. కాస్త ధర ఎక్కువైనా సరే ఈవీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. అనుకోని రీతిలో కొన్ని ఈవీల్లో మంటలు చెలరేగటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సాంకేతిక సమస్యను చిన్నదిగా చూడాలా? పెద్దదిగా చూడాలా? అన్న దానిపై స్పష్టత లేని పరిస్థితి. ఇలాంటివేళ.. ఈవీల్లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీల నాణ్యత నాసిరకంగా ఉంటే ఇలాంటి తిప్పలు తప్పవంటున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈవీల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిపోతే ఏం చేయాలి? మంట ఏదైనా సరే..దాన్ని ఆర్పేందుకు మన మనసులోకి వచ్చేది నీళ్లు మాత్రమే. నిప్పు కనిపించి.. దాన్ని ఆర్పాలంటే నీటిని వాడేస్తుంటారు. మనసు కూడా అదే చెబుతుంది. ఎక్కడి దాకానో ఎందుకు.. నిప్పు పడి చేయి కాలిందనుకోండి.. వెంటనే నీళ్లు పోస్తారు చాలామంది. కానీ.. అది చాలా తప్పు అని.. దానికి బదులు తేనె మంచిదని చెబుతారు.

అలానే ఈవీల్లో నిప్పు రాజుకొని.. మంటలు వచ్చినప్పుడు నీటిని అస్సలు వాడకూడదని చెబుతున్నారు. ఎందుకంటే.. నీళ్లు పోసిన వెంటనే నిప్పు చల్లారాలి. కానీ.. ఈవీల్లో మాత్రం అందుకు భిన్నంగా నీటితో ఆ బ్యాటరీ కాస్తా పేలిపోతుంది.

ఎందుకిలా? అన్న విషయంలోకి వెళితే.. ఎలక్ట్రికల్ వాహనాలు ఏవైనా సరే.. లిథియం అయాన్ బ్యాటరీలతో నడుస్తాయి. సెల్స్ తయారీ ప్యాకింగ్ లో లోపం ఉంటే వేడెక్కి మంటలు వ్యాపిస్తుంటాయి.

అంతర్గతంగా జరిగే రసాయన చర్యతో బ్యాటరీ లోపల ఆర్గానిక్ ద్రవ రూప ఎలక్ట్రోలైట్లు మంటలు మరింత పెరిగేలా చేస్తాయి. ఇలాంటి సమయంలో నీళ్లు పోస్తే.. హైడ్రోజన్ వాయువు.. లిథింయ హైడ్రాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఆ వెంటనే పేలిపోతుంది. లేదంటే మంటల తీవ్రత ఎక్కువ అవుతుంది.

మరి.. ఈవీల్లో నిప్పు రాజుకున్నంతనే ఏం చేయాలన్న దానికి చెబుతున్న సమాధానం.. ఏబీసీ పౌడర్ చల్లాలి. ఈ పొడి చల్లటం వల్ల ఒక పొరలా ఏర్పడి.. మంట మరింత పెరగకుండా చేసే అవకాశం ఉంది. మార్కెట్లో దీని ధర రెండు కేజీలు రూ.వెయ్యిగా చెబుతున్నారు. సో.. ఈవీలు వాడే వారు తమతో పాటు ఏబీసీ పైడర్ లేదంటే.. సిలిండర్ల మాదిరి ఉండే దానిని వినియోగిస్తే మంచిదని చెబుతున్నారు.
Tags:    

Similar News