జయ సంపద ఎవరి సొంతం?

Update: 2016-12-07 06:39 GMT
జయలలిత రాజకీయంగా ఎంత పవర్ ఫుల్లో... ఆమె ఖజానా కూడా అంతే ఫుల్లు. అందుకే ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులున్నాయి. భారీగా ఆస్తులు కూడబెట్టిన జయలలితకు నా అన్నవారెవరూ లేకపోవడంతో ఇప్పుడు ఆ సంపదంతా ఏమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది.  జయలలిత మరణంతో పార్టీ పగ్గాలను శశికళకు - ముఖ్యమంత్రి పదవి పన్నీర్ సెల్వంకు అప్పజెప్పుతూ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి.. కానీ, ఆస్తులు సంగతి మాత్రం ఇంకా ఏమీ తేలినట్లుగా లేదు. అసలు జయ విల్లు ఏమైనా రాశారా... లేదంటే ఎవరితోనైనా చెప్పినట్లుగా ఆధారాలున్నాయా... ఇప్పటికే ఎవరైనా ఆమె ఆస్తిపాస్తులను కొట్టేసేందుకు తమ పేరిట రాయించుకున్నారా వంటి అనేక అంశాలు ఇప్పుడు తమిళనాట చర్చనీయంగా మారాయి. జయ ఆసుపత్రిలో ఉన్నంతకాలం హైడ్రామా నడిపి ఆస్తులన్నీ చక్కబెట్టేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.
    
జయకు వేల కోట్ల ఆస్తులున్నట్లు చెబుతారు.  ఆర్ కె నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక సమయంలో  జయలలిత పోటీ చేసేటప్పుడు మాత్రం 2015 జూన్ వరకు తనకు రూ.117.13 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో  ప్రకటించారు. ఆ ఆస్తులో పోయెస్ గార్డెన్ లోని 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రూ.43.96 కోట్ల జయలలిత నివాస గృహం వేద విలాస్ కు ప్రస్తుతం శశికళ వారసురాలు కాబోతున్నారని అనుకుంటున్నారు.
    
ఇక హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో 14.50 ఎకరాల్లో ఉన్న జేజే గార్డెన్స్ - తమిళనాడులో కంచీపురంలో 3.43 ఎకరాలు వ్యవసాయ భూమి..  కాంచీపురం చెయూర్ లోని ఆస్తుల సంగతి ఏమైందో తెలియదు. జయలలితకు మొత్తం నాలుగు వాణిజ్య భవనాలున్నాయి. అందులో హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న భవనం  శశికళ అన్న కుమారుడు వీఎన్ సుధాకర్ కు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
    
జయ తన వద్ద 21 కేజీల బంగారు ఆభరణాలున్నట్లు గతంలో వెల్లడించారు. అయితే... అక్రమాస్తుల కేసులు తేలనందున అవన్నీ కర్ణాటక ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి. సుమారు 3.2 కోట్ల విలువ చేసే 1250 కేజీల వెండి కూడా ఆమె వద్ద ఉంది. ఇవి కాకుండా పాతవి - కొత్తవి అన్నీ కలిపి 9 కార్లు ఉన్నాయి. పలు వ్యాపారాల్లో భాగస్వామ్యం - పెట్టుబడులు ఉన్నాయి. ఇవంతా ఎవరి పరం అవుతాయన్నది త్వరలో తేలనుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News