ఏం చెబుతారు.. క్లారిటీ ఇస్తారా.. జ‌న‌సేన స‌భ‌పై కోటి ఆశ‌లు!!

Update: 2023-03-14 10:39 GMT
రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొన్న రెండు కీల‌క ఘ‌ట్టాల‌కు ఏపీలో ఈ రోజు ప్రాధాన్యం ఏర్పడింది. ఒక‌టి ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. అదేస‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలో పార్టీ ఆవిర్భావ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ఈ వేడుక‌ల‌పై మ‌రింత ఆస‌క్తి.. ఉత్కంఠ కూడా నెల‌కొంది. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు జ‌రుగుతున్న ఈ ఆవిర్భావ వేడుక‌ల్లో ప‌వ‌న్ ఏం చెబుతారు? వ‌చ్చే ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఇస్తారా?  పొత్తుల‌పై ఎలాంటి వ్యూహం ప్ర‌క‌టిస్తార‌ని.. పార్టీ అభిమానులు.. రాజకీయ వ‌ర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి.

ప‌వ‌ర్ స్థార్‌ పవన్‌ కల్యాణ్ సారథ్యంలో 2014 మార్చి 14న పురుడు పోసుకున్న జనసేన.. ఒడుదొడుకుల్ని తట్టుకుని ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ అనుబంధ విభాగం యువ‌రాజ్యానికి ప్రాతినిధ్యం వ‌హించిన ప‌వ‌న్‌..తర్వాత‌.. 2014లో సొంత‌గానే పార్టీని స్థాంపించారు.  పార్టీ ప్రారంభించిన‌ కొన్నాళ్లకే ఎన్నికలు వ‌చ్చినా అప్పట్లో పోటీకి దూరంగా ఉన్నారు.

అయితే, టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ మద్దతిచ్చారు. ఆ తర్వాత కూడా కూటమితో కలిసి సాగిన ఆయన.. 2019 ఎన్నికల ముందు ఆ రెండు పార్టీలకు దూరం జరిగారు. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలో నిలవగా.. పార్టీ పరాజయం పాలైంది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. అనూహ్యంగా బీజేపీతో మ‌రోసారి చేతులు క‌లిపారు. అయిన‌ప్ప‌టికీ.. రాష్ట్ర బీజేపీ నేత‌ల‌తో స‌ఖ్య‌త జారుడుబండ‌పై న‌డ‌క‌నే త‌ల‌పిస్తోంది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని గ‌ద్దెదింపాల‌న్న కీల‌క ల‌క్ష్య సాధ‌న‌లో టీడీపీలో చేతులు క‌లుపుతార‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయిన‌ప్పటికీ.. ఈ విష‌యంలోనూ అనేక సందేహాలు.. క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఏడాది ముందు జ‌రుగుతున్న ఈ ఆవిర్భావ వేడుక‌ల్లో ఏదో ఒక‌టి తేల్చ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే, జనసేన పార్టీ పదో ఆవిర్భావ వేడుకలకు కృష్ణా జిల్లా మచిలీపట్నం ముస్తాబైంది. సభ కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకూ వారాహి వాహనంలో పవన్‌ కల్యాణ్ ర్యాలీగా వెళ్లి సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణలోని కొండగట్టుతో పాటు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వారాహికి పూజలు నిర్వహించిన పవన్.. తొలిసారి రాజకీయ పర్యటన కోసం వినియోగిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News