సారూ.. మీరే దిక్కు అని అంటే కేసీఆర్ లో వరాల దేవుడు బయటకొస్తాడు

Update: 2019-12-02 06:31 GMT
మొండోడు రాజు కంటే బలవంతుడన్న సామెత తెలిసిందే. కానీ.. మొండితనం మూర్తీభవించిన వ్యక్తే రాజైతే? ఇప్పుడీ మాటకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తనను నానా మాటలు అని.. తిట్టి.. శాపనార్థాలు పెట్టి.. దిష్టిబొమ్మలు తగలెట్టి.. పొట్టి వీడియోలతో ఇష్టారాజ్యంగా మాటలు అనేసిన వారి చేత జైజైలు కొట్టించుకోవటం.. పాలాభిషేకాలు చేయించుకోవటమే కాదు.. అలా అనేందుకు కారణమైన వారు అడ్రస్ లేకుండా పోయేలా చేయటంలో విజయవంతమయ్యారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.

52 రోజుల సుదీర్ఘ సమ్మె చేసినా.. పలువురు ఆత్మబలిదానం చేసినా చలించని కేసీఆర్.. జీతాలు ఇవ్వాలన్న హైకోర్టు మాటకు.. డబ్బుల్లేవని చేతులెత్తేసిన గులాబీ బాస్ మాటలు ఇప్పుడు అనూహ్యంగా మారిపోయాయి. ఆయన నోటి నుంచి వస్తున్న తాజా మాటలు చూస్తుంటే.. అప్పట్లో ప్రభుత్వం తరఫున హైకోర్టులో వినిపించిన వాదన అంతా కేసీఆర్ కు తెలిసే చేశారా? అన్న సందేహం కలిగేలా ఉన్నాయని చెప్పాలి.

మొత్తంగా చూస్తే.. సారూ.. మాకు మీరే దిక్కు అని సాగిలపడాలే కానీ.. కేసీఆర్ లోపలి వరాల దేవుడు బయటకు రావటమే కాదు.. కడుపు నిండిపోయే వరాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని చెప్పాలి. ఆర్టీసీ కార్మికులు నిరసన చేసే సమయంలో తాము తెర మీదకు తెచ్చిన డిమాండ్లలో ఏ ఒక్క దానికి సానుకూలంగా లేని ఆయన.. తానేమీ చేయలేనని చెప్పటమే కాదు.. ఆర్టీసీని మూసివేయక తప్పదని.. ప్రైవేటీకరణ అనివార్యమని తేల్చేశారు.

కానీ.. కార్మికులంతా సారు మీరే దిక్కు అన్న తర్వాత ఆయన నోటి మాటలు మారిపోవటమే కాదు.. ప్రైవేటీకరణ ఊసే లేదని చెప్పటమే కాదు.. వారు కలలో కూడా ఊహించని వరాల్ని ప్రకటించి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆర్టీసీ కార్మికుల్లో తాము ఎంపిక చేసి తీసుకొచ్చిన ఉద్యోగుల ముందు మాట్లాడి.. వారితో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం వరాల వర్షం కురిపించారు. ఆయనిచ్చిన వరాల్ని చూస్తే..

% సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇస్తాం. దరఖాస్తు చేసుకోకపోయినా ఉద్యోగం ఇస్తాం. ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం.
% టికెట్‌ బాధ్యత సంపూర్ణంగా ప్రయాణికుడిపైనే. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోం.
% కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్నవారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు.
% మహిళా ఉద్యోగులకు నైట్‌ డ్యూటీలు వేయవద్దు. రాత్రి 8 గంటలకే వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి.
% 20 రోజుల్లోనే ప్రతి డిపోలో మహిళల కోసం టాయిలెట్లు, డ్రెస్‌ చేంజ్‌ రూమ్స్‌, లంచ్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి.
% మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలలపాటు చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ మంజూరు చేస్తాం.
% మహిళా ఉద్యోగులకు ఖాకీ డ్రెస్‌ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్‌ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్‌ వేసుకునే అవకాశం కల్పిస్తాం.
% మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగు సూచనలు చేయడం కోసం కమిటీ ఏర్పాటు.
% ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా హెల్త్‌ సర్వీసులు అందించాలి. అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు.
% ప్రతి డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. మందుల కోసం బయటకు తిప్పవద్దు.
% ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు.
% ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపు.
% పీఎఫ్‌ బకాయిలు, సీసీఎ్‌సకు చెల్లించాల్సిన డబ్బు చెల్లిస్తాం.
% కావాల్సిన ేస్పర్‌ పార్ట్స్‌ను డిపోల్లో అందుబాటులో ఉంచుతాం.
% తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేస్తాం.
% కార్మికుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది.
% ఆర్టీసీలో పార్సిల్‌ సర్వీసులను ప్రారంభించాలి. ఆరోగ్యం బాగాలేని వారిని ఇందుకు ఉపయోగించండి.
% చెడిపోయిన బస్సులను బాగు చేసి ఉపయోగించండి. ఇవన్నీ చేస్తే.. ఏడాదికి రూ.1,000 కోట్లు లాభాలు వస్తాయి. కార్మికుడికి ఏడాదికి రూ.లక్ష బోనస్‌ వస్తుంది.
% రోజుకు మీరు రూ.10.50 కోట్లు సంపాదిస్తున్నారు. రోజూ మరో రూ.కోటి ఎక్కువ సంపాదిస్తే.. సంస్థ లాభాల్లోకి వస్తుంది. ఏడాదికి రూ.360కోట్లు అదనంగా వస్తాయి.
% అధికారుల్లో మార్పు రావాలి. యాజమాన్యం-కార్మికులు అన్న తేడా ఉండొద్దు. బిడ్డను తల్లి చూసినట్టుగా కార్మికులను చూడాలి.
% లేబర్‌ కోర్టుకు పంపిద్దును. కానీ..అక్కడితో ఆగుతదా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.
% ఆర్టీసీకి వెయ్యి కోట్లు లాభం వచ్చినప్పుడు పండగ చేద్దాం.
% ఏడాదికి ఓసారి డిపో సిబ్బంది వన భోజనాలకు వెళ్లండి. ఆడిపాడండి.
Tags:    

Similar News