బైడెన్ గెలిచిన వేళలో ట్రంప్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?

Update: 2020-11-08 10:10 GMT
నరాలు తెగే ఉత్కంఠ.. టీ 20 మ్యచ్ మూడు రోజులు సాగితే ఎలా ఉంటుందన్న అనుభవం ప్రపంచ ప్రజలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల పుణ్యమా అని ఎదురైంది. ఓట్ల లెక్కింపు మొదటి రోజున తిరిగిన మలుపులు అన్నిఇన్ని కావు. ఏ గంటలో ఎవరు అధిక్యంలో ఉంటారో.. ఆ వెంటనే ఎవరు వెనుకబడతారో ఏ మాత్రం అంచనా వేయలేని రీతిలో ఫలితాలు వెల్లడయ్యాయి. మొదటి రోజు వరకు సాగిన సస్పెన్స్.. రెండోరోజుకు ఒక కొలిక్కి రాగా.. ఆ తర్వాత తుది ఫలితం ఎలా ఉంటుందన్న అంచనా ఏమిటో చాలామందికి అర్థమైంది.

అయినప్పటికీ.. ఆఖరి పరుగు తీసే వరకు మ్యాచ్ పూర్తి కానట్లే.. మేజిక్ ఫిగర్ కు చేరుకునే వరకు ఎన్నికల్లో విజయం సాధించనట్లే. ఎట్టకేలకు కీలకమైన పెన్సిల్వేనియా ఫలితం వెలువడటంతో.. బైడెన్ గెలుపు ఖరారైంది. విజయోత్సవాలు.. సంబరాలు షురూ అయ్యాయి. ఆ వెంటనే.. నెవడా రాష్ట్రం కూడా బైడెన్ ఖాతాలో పడటంతో తిరుగులేని విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నట్లైంది. దీంతో.. మరో మూడు రాష్ట్రాల్లో (జార్జియా.. అలస్కా.. నార్త్ కరోలినియా)ఫలితాలు వెలువడాల్సి వచ్చినా.. అవన్నీ నామమాత్రంగా మారనున్నాయి.

కీలకమైన పెన్సిల్వేనియా ఫలితంతో బైడెన్ గెలుపు ఖరారైతే.. ట్రంప్ ఓటమి తేలిపోయింది. ఆ సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆశ్చర్యపోవాలంతే. కీలకమైన ఫలితం కూడా అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తుంటే.. ట్రంప్ మాత్రం..

వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ లో గోల్ఫ్ ఆడుతూ ఉన్నారు. ఆయనకు బైడెన్ గెలిచారన్న సమాచారం అందినంతనే.. ఆయన స్పందిస్తూ.. తాను ఓటమిని అంగీకరించని.. అమెరికా అధ్యక్షుడు ఎవరన్నది లీగల్ ఓట్లు నిర్ణయిస్తాయని చెప్పటం ద్వారా.. కొత్త చర్చకు తెర తీశారు.
Tags:    

Similar News