సీఎం జగన్ ప్రసంగిస్తున్న వేళ.. సభకు వచ్చిన వృద్ధుడి మృతి

Update: 2020-12-31 03:31 GMT
తాను ఏర్పాటు చేసిన సభకు హాజరై.. తన మాటల్నిఎంతో ఆసక్తిగా వింటున్న సభికుల్లో ఒకరు అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన మరణించిన విషాదం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో చోటు చేసుకుంది. ఇంటి పట్టా కోసం ఆశగా వచ్చిన ఆ పెద్దాయన విగతజీవిగా మారటంతో.. వృద్ధుడి సతీమణి కన్నీరుమున్నీరు అవుతోంది. గుండెల్ని పిండేసే ఈ ఉదంతం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాకు చెందిన గుంకలాం గ్రామంలో పేదల ఇళ్ల స్థలాల లే అవుట్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిపాలనా రాజధానిగా కోరుకుంటున్న విశాఖలో 1.80లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారని.. కానీ ఆ భూములతో సంబంధం లేని వ్యక్తి కోర్టుకు వెళ్లినట్లుగా పేర్కొన్నారు.

విజయనగరంలో 400 ఎకరాల్లో 12,301 మందికి ఒకేచోట ఇళ్లు కట్టించి ఇవ్వనున్న కార్యక్రమం గురించి పేర్కొన్నారు. ఇలా తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి సీఎం జగన్ వివరాలు వెల్లడిస్తున్న వేళ.. సభకు వచ్చిన 70 ఏళ్ల మంతెన సత్తిబాబు.. గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. గుంకలాం లే అవుట్ లో ఎఫ్ బ్లాక్ లో ప్లాట్ నెంబరు ఎఫ్1892 మీద ఆయన సతీమణి కళావతి పేరుతో కేటాయించారు.

ఇళ్ల పట్టాల కోసం ఉదయం ఎనిమిది గంటలకే రావటం..ఎండలో ఎక్కువసేపు ఉండిపోవాల్సి రావటంతో వడదెబ్బకు గురైన సత్తిబాబు నీరసంగా ఉందని నీడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ.. కుప్పకూలిపోయారు. దీంతో.. ఆయనకు ప్రధమ చికిత్స చేసేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. సీఎం జగన్ ప్రసంగిస్తున్న వేళలో చోటు చేసుకున్న ఈ ఘటనతో కలకలం రేగుతుందన్న ఉద్దేశంతో.. సభకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు ప్రయత్నించారు. ఎన్నో ఆశలతో వచ్చిన ఈ పెద్ద వయస్కులకు ఊహించని విషాదం ఎదురైందని చెప్పాలి. ఈ దంపతులకు పిల్లలు లేరని చెబుతున్నారు.
Tags:    

Similar News