ఎన్సీపీ ప్రెసిడెంట్ ఎవరు ?

Update: 2023-05-04 10:55 GMT
ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలుగా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే పగ్గాలు అందుకోబోతున్నారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పార్టీలోని సీనియర్ నేతల్లో ఒకడైన చగన్ భుజబల్ మీడియాతో మాట్లాడుతు సుప్రియా అధ్యక్ష బాధ్యతలకు సరిపోతుందన్నారు. పార్లమెంటు సభ్యురాలిగా బాగా పనిచేస్తున్నట్లు చెప్పారు. సుప్రియా బారామతి పార్లమెంటు స్ధానం నుండి వరుసగా మూడుసార్లు ఎంపికయ్యారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.

పార్టీలో ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కానీ బాగా యాక్టివ్ గా ఉంటారు. జాతీయస్ధాయిలోని వివిధ పార్టీల్లోని అధినేతలతో ఆమెకు మంచి సంబంధాలున్నాయి. కాబట్టే సుప్రియను భుజ్ బల్ జాతీయ అధ్యక్ష పదవిని అప్పగించాలని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో  రాష్ట్ర అధ్యక్షుడిగా శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ను నియమించాలని కూడా చగన్ చెప్పారు. అప్పుడు పార్టీ పదవుల విషయంలో సమతూకం వచ్చినట్లవుతుందన్నారు.

సంవత్సరాలుగా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్ ఈమధ్యనే తన పదవికి రాజీనామా చేశారు. పవార్ నే కంటిన్యు అవ్వమని నేతలు ఎంతగా ఒత్తిడి పెట్టినా ఆయన అంగీకరించటంలేదు. నిజానికి 87 ఏళ్ళ వయసులో పవార్ ఏమంత యాక్టివ్ గా లేరన్నది వాస్తవం.

అయితే ప్రధానమంత్రిగా పనిచేయాలని మాత్రం పవార్ కు బలమైన కోరికుంది. అందుకనే ప్రతిపక్షాల తరపున ప్రధాని పదవికి తగిన అభ్యర్ధులు ఎవరు అనే చర్చ వచ్చినపుడల్లా పవార్ పేరు వినిపిస్తుంటుంది.

ఇలాంటి నేపధ్యంలోనే పవార్ ఎందుకనో జాతీయ అధ్యక్ష బాధ్యతలనుండి తప్పుకున్నారు. బహుశా ఇక తనకు ప్రధాని పదవి వచ్చే అవకాశాలు లేవని ఫిక్సయిపోయినట్లున్నారు. ఎన్డీయే తరపున నరేంద్రమోడీ బలంగా ఉండటంతో ప్రతిపక్షాల కూటమి అధికారంలోకి రాదని పవార్ కు అర్ధమయ్యుంటుంది.

అందుకనే 87 ఏళ్ళ వయసులో ఢిల్లీ-ముంబాయ్ మధ్యే కాకుండా ఇతర ప్రాంతాల్లో   తిరిగే ఓపికలేక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని అనుకున్నట్లున్నారు. ఇందులో భాగంగానే ముందుగా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్నది. తర్వాత పగ్గాలు ఎవరికి అందుతాయో చూడాలి.

Similar News