దినపత్రికల ద్వారా కరోనా సోకదంటున్న పెద్ద మనిషి ఎవరు?

Update: 2020-03-27 00:30 GMT
ఊహించని ఉత్పాతం. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని కూడా న్యూస్ పేపర్ల యజమానులు.. యాజమాన్యాలు ఇప్పటివరకూ కలలో కూడా ఆలోచించి ఉండరేమో. ఉన్నట్లుండి ఊడిపడిన కొండంత సమస్యను ఇప్పుడెలా అధిగమించాలో అర్థం కాక కిందా మీదా పడుతున్నాయి ప్రింట్ మీడియా సంస్థలు. కరోనా వేళ.. వార్తాపత్రికల్ని ఇంట్లోకి రానిస్తే.. ఎక్కడ వైరస్ వస్తుందో అన్న సందేహాన్ని కొందరు.. లేదు.. లేదు.. నిజంగానే వస్తుంది తెలుసా? అంటూ గూగుల్ లోని సమాచారాన్ని చూపిస్తూ మరికొందరు.. మొత్తంగా రోజు పొద్దుపొద్దున్నే పలుకరించే న్యూస్ పేపర్లు ఈ రోజు బంద్ అయిన పరిస్థితి.

తమకు ఇలాంటి సమస్య ఒకటి వస్తుందని కూడా ఊహించని యాజమాన్యాలకు ఇప్పుడు ఎదురైన సమస్యను ఎలా అధిగమించాలో అర్థం కాని పరిస్థితి. ఇందులో భాగంగా.. న్యూస్ పేపర్ల ద్వారా కరోనా వైరస్ రాదన్న విషయాన్ని అందరూ నమ్మేలా చెప్పటం కోసం ప్రింట్ మీడియా సంస్థల యజమాన్యాలు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఇలాంటివేళ.. తాజాగా ఒక ప్రముఖ దినపత్రిక ఇదే విషయాన్ని ఒక పెద్ద మనిషి చేత చెప్పించే ప్రయత్నం చేశారు.

వార్తా పత్రికలు.. మ్యాగజీన్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లుగా.. సోకిన చరిత్ర ఉందన్న ఉదాహరణ ఒక్కచోట అంటే ఒక్కచోట కూడా లేదన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. తాము చెబుతున్న ఈ విషయాన్ని అనేక పరిశోధనలు.. అధ్యయనాల తర్వాతే  చెబుతున్నామని ఘంటా బజాయించి చెబుతున్నారు ఇన్మా సీఈవో  విల్కిన్ సన్.

ఇంతకీ ఈ ఇన్మా ఏంది మాష్టారు? అంటారా? విషాదకరమైన విషయం ఏమంటే.. ఇన్మా అనే సంస్థ ఒకటి ఉందని.. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా పరిస్థితులు.. పరిణామాలు.. పాఠకుల అభిరుచి లాంటి ఎన్నో కీలకమైన అంశాల మీద పని చేస్తుందన్న విషయం చాలామంది తోపు జర్నలిస్టులకు కూడా తెలీదు. వార్తలు రాశామా? పరిచయాలు పెంచుకున్నామా? ఆఫీసులో పట్టు ఉందా లేదా? చూసే బీట్ లో తోపులమా? అన్నదే తప్పించి.. ప్రపంచ మీడియా గమనం ఏమిటి? అదెలా వెళుతోంది? రానున్న రోజుల్లో మీడియా ఎలా మారనుంది? లాంటి అంశాల మీద ఫోకస్ చేసేటోళ్లు చాలా తక్కువగా కనిపిస్తారు.

అంతర్జాతీయ న్యూస్ మీడియా అసోసియేషన్ కు పొట్టిపేరు ఇన్మా. ఆ సంస్థ సీఈవో తాజాగా రంగంలోకి దిగారు. కరోనా ప్రభావం న్యూస్ పేపర్ మీద ఉండదని నొక్కి వక్కాణిస్తున్నారు. నిజమే.. ఆయన చెప్పే అంశాల్ని చాలా వరకూ నిజమని నమ్మొచ్చు. అలా నమ్మేలా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు.

పత్రికల్ని ప్రింట్ చేసే కాగితం (పత్రికా పరిభాషలో చెప్పాలంటే న్యూస్ ప్రింట్) ఉపరితలం.. ప్రింట్ చేసే పద్దతి వైరస్ వ్యాప్తికి అవకాశం లేనట్లుగా.. సేఫ్ గా ఉంటాయన్నది ఆయన ఉవాచ. అందులో నిజమే ఉండొచ్చు. ఇందుకు ఆయన చెప్పిన అంశాల్ని చూస్తే.. వార్తా పత్రికలకు వాడే ఇంక్.. ప్రింట్ చేసే పద్దతి మొత్తం వైరస్ లాంటివి వ్యాప్తి కాని విధంగా చేస్తారు. పేపర్ ను ప్రింట్ చేసే సమయంలోనూ యాజమాన్యాలు చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. న్యూస్ ప్రింట్ లాంటి పోరస్ ఉపరితలాల ద్వారా వ్యాప్తి చెందే శక్తి వైరస్ కు చాలా చాలా తక్కువ (అస్సలు లేదంటే లేదన్న మాట చెప్పటం లేదు గమనించారా?) అని చెప్పుకొచ్చారు.

పెద్దాయన చెప్పినవన్ని నిజాలే. అయితే.. ఇక్కడ ఆయన ప్రస్తావించని నిజాలు కొన్ని ఉన్నాయి. అదేమంటే.. ప్రింటింగ్ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఊళ్లల్లో అయితే ఏజెంట్లకు.. హైదరాబాద్ మహానగరంలో అయితే.. హోల్ సేలర్ కు (ఈ హోల్ సేలర్ చాలా కంపెనీల పేపర్లను కొనుగోలు చేస్తాడు) ఇస్తారు. అక్కడి నుంచి హ్యాకర్లు  తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని వారే నేరుగా కానీ.. లేదంటే.. బాయ్ చేత కానీ వేయిస్తుంటారు.

అంటే.. ప్రింటింగ్ ప్రెస్ నుంచి దాదాపు మూడు చేతులు పేపర్లు మారతాయి. ఇలా మారే క్రమంలో.. పేపర్ వేసే వారి చేతికి కరోనా వైరస్ అంటి ఉందని అనుకుందాం. అప్పుడు అది కాస్తా పేపర్ కు అంటుకోకుండా ఉంటుందా? అన్నది ప్రశ్న. ప్రింటింగ్ సందర్భంలో కరోనా వైరస్ అంటే ఛాన్సు లేదు. కానీ.. ఆ తర్వాత అంటే.. ఇంటికి పేపర్ చేరుకునే సమయానికి వైరస్ రహితంగా ఉంటుందా? అన్నది అన్నింటికంటే కీలకమైనది. అయితే.. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా.. ప్రింట్ చేస సమయంలో తీసుకునే జాగ్రత్తలు చెప్పేసి వదిలేయటం చూస్తే.. పెద్దాయన అబద్ధం చెప్పింది లేదు.. అలా అని పూర్తినిజం చెప్పింది లేదన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News