టెక్నిక‌ల్‌గా టీడీపీ.. నారా వారిదా.. నంద‌మూరోళ్ల‌దా...!

Update: 2023-02-27 09:43 GMT
టీడీపీ ఎవ‌రిది?  ఎవ‌రు డీల్ చేస్తున్నారు? ఈ రెండు ప్ర‌శ్న‌లు గ‌త వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చకు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం.. టీడీపీ యువ నాయ‌కుడు.. నారా లోకేష్ చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.. అనే ఒకే ఒక్క కామెంటే!! దీంతో అస‌లు టీడీపీనే నంద‌మూరి కుటుంబానిది అయిన‌ప్పుడు.. వారిని ఆహ్వానించ‌డం ఎందుకు? ఏమిటి? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

అంతేకాదు.. అస‌లు టీడీపీ ఎవరిది? అనే చ‌ర్చ కూడా మొద‌లైంది. ఈ విష‌యంలో టెక్నిక‌ల్ ఇష్యూల‌ను ప‌రిశీలిస్తే.. టీడీపీ నారా కుటుంబానికే చెందుతుంద‌ని.. రాజ‌కీయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఉదా హ‌ర‌ణ‌కు ఇటీవ‌ల మ‌హారాష్ట్రలో జ‌రిగిన ప‌రిణామాల‌ను వారు ఉటంకిస్తున్నారు. అక్క‌డ 4 ద‌శాబ్దాల‌కు పైగానే.. శివ‌సేన పార్టీ ఉంది. ప్ర‌ముఖ కార్టూనిస్టుగా ఎదిగిన బాల ఠాక్రే దీనిని స్థాపించారు. ఇది ఆదిలో ఒక సేవా సంస్థ‌.

అందునా.. మ‌రాఠా డామినేష‌న్ ఉన్న రాష్ట్రంలో ప్రాంతీయ త‌త్వాన్ని నిల‌బెట్టాల‌నే ఏకైక ఉద్దేశంతో అంటే.. మ‌న ద‌గ్గ‌ర తెలుగు వారి ఆత్మగౌరవం నినాదం మాదిరిగానే.. శివ‌సేన‌ను ఏర్పాటు చేశారు. త‌ర్వాత‌.. రాజ‌కీయ పార్టీగా మారింది. బాల‌ఠాక్రే మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆయ‌న కుమారుడు ఉద్ధ‌వ్ దీనిని తీసుకున్నారు. ముందుకున‌డిపించారు. అంతేకాదు.. 2019 మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ.. 56 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. త‌ర్వ‌త త‌లెత్తిన రాజ‌కీయ సంక్షోభంతో 42 మంది ఎమ్మెల్యేలు.. ఏక్‌నాథ్ షిండే(ఈయ‌న కూడా శివ‌సేన నుంచి వ‌చ్చిన నాయ‌కుడే)వైపు నిల‌బ‌డ్డారు. దీంతో పార్టీలోని ఎమ్మెల్యేల్లో 75 శాతం మందిపైగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో పార్టీ ఈయ‌న‌కు ద‌ఖ‌లు ప‌డింది. సో.. శివ‌సేన ఎవ‌రు స్థాపించార‌నేది కాదు.. ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం ప్ర‌కారం.. ఎవ‌రికి మ‌ద్ద‌తు ఉంటే..వారిదే పార్టీ. ఇక‌, టీడీపీ విష‌యానికి వస్తే.. అన్న‌గారు ఎన్టీఆర్ స్థాపించారు.

అయినా.. కూడా.. త‌ర్వాత ప‌రిణామాల్లోల చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపైనే పార్టీ డిపెండ్ అయింది. టెక్నిక‌ల్‌గా చూసుకుంటే.. 75శాతం మంది ఎమ్మెల్యేలు..(ఎంత‌మంది ఉంటే అంత‌లో) ఎవ‌రికి అండ‌గా నిలిస్తే..వారిదే పార్టీ. సో. ఇలా చూసుకుంటే.. చంద్ర‌బాబు మూడు సార్లు పార్టీని  అధికారంలోకి తెచ్చారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఆయ‌నే ఉన్నారు. సో.. టెక్నిక‌ల్‌గా పార్టీ ఆయ‌న‌కే చెందుతుంది.. త‌ప్ప‌.. మ‌రోచ‌ర్చ‌కు అవ‌కాశం లేదని అంటున్నారు రాజ‌కీయ‌రంగ నిపుణులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News