ప్రధాన పత్రికల్లో షర్మిల వార్తకు ఎవరి ప్రయారిటీ ఎంత?

Update: 2021-02-10 04:46 GMT
అనూహ్యంగా తెర మీదకు వచ్చి.. రాజకీయ సంచలనంగా మారిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టనున్నారన్న వార్త.. ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. తొలుత ఈ వార్తను చాలామంది కొట్టిపారేశారు. చివరకు.. ఆ వార్త వాస్తవరూపం దాల్చటం రాజకీయ కలకలానికి తెర తీసింది. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలన్న వ్యాఖ్యను షర్మిల చేశారే కానీ.. పార్టీ పెడుతున్న వివరాల్ని అధికారికంగా వెల్లడించలేదు. కాకుంటే.. తన అడుగులు కచ్ఛితంగా రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగానే సాగనున్న విషయాన్ని ఆమె స్పష్టం చేశారు.

మరి.. ఈ సంచలన వార్తకు ప్రధాన మీడియా సంస్థలు ఇచ్చిన ప్రయారిటీ ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది. తొలుత ఈ వార్తకు షర్మిల సోదరుడైన జగన్ సొంత మీడియా సంస్థ సాక్షిలో ఇచ్చిన ప్రాధాన్యత నుంచి మొదలు పెడితే.. సాక్షిలోని మూడు ఎడిషన్లు (హైదరాబాద్ నగర మెట్రో పత్రిక.. తెలంగాణ జిల్లాలకు వెళ్లే పత్రిక.. ఏపీ పత్రిక) హైదరాబాద్ లో బ్యానర్ వార్తగా కేసీఆర్ తాజా బహిరంగ సభకే కేటాయించారు. దాని కింద షర్మిల వార్త ఇచ్చారు. పక్కన ఐసీసీఐసీ బ్యాంకు యాడ్ రావటంతో అలాంటి ప్రయారిటీ ఇచ్చినట్లు చెప్పినా.. కేసీఆర్ సభకే భారీ ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం. ఇక..తెలంగాణ జిల్లాల్లో మాత్రం కేసీఆర్ బహిరంగ సభ వార్తకు పక్కనే షర్మిల వార్త ఇచ్చారు. ఏపీలో పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయాన్ని ఘనమైన ప్రాధాన్యతను ఇచ్చి.. షర్మిల వార్తను కిందన ఇచ్చారు.

ఈనాడు విషయానికి వస్తే.. గ్రేటర్ హైదరాబాద్ లో బ్యానర్ వార్తగా ప్రత్యేక కథనాన్ని ఇచ్చి.. దాని పక్కనే షర్మిల వార్తను చిన్నగా పెట్టారు. అయితే.. యాడ్ కారణంగా ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పినా.. కీలకమైన రాజకీయ పరిణామం చోటు చేసుకున్న వేళలోనూ ప్రత్యేక కథనాన్ని బ్యానర్ గా ఇవ్వటం గమనార్హం. ఇక.. తెలంగాణ ఎడిషన్ లో ప్రత్యేక కథనాన్ని భారీగా.. సీఎం కేసీఆర్ సభను సింగిల్ కాలమ్ లో.. షర్మిల వార్తను డీసీ (డబుల్ కాలమ్) లో ఇచ్చారు. ఏపీ విషయానికి వస్తే.. పంచాయితీ ఎన్నికల వార్తకు భారీ ప్రాధాన్యత ఇవ్వగా.. షర్మిల వార్తను ఒక మోస్తరుప్రయారిటీతో ఇచ్చారు.

షర్మిల వార్తకు ఆంధ్రజ్యోతి అందరి కంటే మిన్నగా ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ విషయాన్ని అందరి కంటే ముందే రివీల్ చేసిన ఈ మీడియా అమితమైన ప్రాధాన్యతను ఇచ్చింది. తన మూడు ఎడిషన్లలోనూ దీన్నే భారీ బ్యానర్ వార్తగా మలిచారు. ఇక.. తెలంగాణ అధికారపార్టీ సొంత మీడియా సంస్థ నమస్తే తెలంగాణలో షర్మిల వార్త మొదటి పేజీలోనే కాదు.. ప్రధాన సంచికలో ప్రాధాన్యతగా ఇవ్వకపోవటం గమనార్హం. ఈ పత్రికకు చెందిన రెండు ఎడిషన్లలోనూ(గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ) షర్మిల వార్త కనిపించలేదు. భూతద్దం వేసుకొని చూస్తే.. ఏమైనా.. ఎక్కడైనా ఇచ్చారేమో అన్నది సందేహమే. ఇలా షర్మిల వార్తను తెలుగునాట ప్రధాన పత్రికలుగా పేర్కొనే నాలుగు మీడియా సంస్థల కవరేజీ కాస్త భిన్నంగా ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News