గ్రేట‌ర్ ఫైట్‌ లో భ‌య పెడుతున్న బీసీ ఓటు.. ఏక‌ప‌క్ష‌మేనా?

Update: 2020-11-27 03:30 GMT
గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అన్ని సామాజిక వ‌ర్గాల ఓట్లు కీల‌క‌మే. అయితే.. అన్నిటిక‌న్నా.. బీసీల ఓటుకు మ‌రింత ప్రాధాన్యం ఏర్ప‌డింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. బీసీల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డం. ముఖ్యంగా సెటిల‌ర్ల‌లోనే కాకుండా స్థానికంగా తెలంగాణ వాసుల్లోనూ బీసీలు ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో అన్ని ప్ర‌దాన పార్టీలూ బీసీ ఓటుబ్యాంకుపై ఆశ‌లు పెట్టుకున్నాయి. అదేస‌మ‌యంలో కొన్ని పార్టీల్లో బీసీ ఓటు బ్యాంకుపై ఒకింత ఆందోళ‌న కూడా ఉంది. ఆది నుంచి హిందూ పార్టీగా పేరున్న బీజేపీకి ఈ విష‌యంలో చాలా గంద‌ర‌గోళం ఉంది.

నగరం మొత్తంలో 150 డివిజన్లు ఉండగా, దాదాపు 60, 70 డివిజన్లలో బీసీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. దీంతో దాదాపు అన్ని పార్టీలూ బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాయి. ఇక‌, టీఆర్ ఎస్‌, బీజేపీలు ఏకంగా 50 శాతానికి మించి స్థానాలను కేటాయించాయి. పలుచోట్ల జనరల్‌  స్థానాల్లో సైతం బీసీలకు టికెట్లు ఇచ్చాయి. టీఆర్ఎస్‌ సగానికి సగం సీట్లు బీసీలకు ఇవ్వగా.. బీజేపీ అంతకుమించి ఇచ్చింది. బీసీ కులాల్లోనూ యాదవ, గౌడ, మున్నూరు కాపు కులాలకే ప్రాదాన్యం ఇచ్చాయి. అయితే.. ఈ వ‌ర్గం ఎటుంది?  ఎవ‌రికి మొగ్గు చూపుతుంది?  అనేది కీల‌కంగా మారిన విష‌యం.

బీసీల విష‌యంలో కేసీఆర్‌కు సానుకూల కోణం ఆది నుంచి ఉంది. త‌న ప్ర‌భుత్వంలో బీసీల‌కు అగ్ర‌స్థా నం ఉంటుంద‌ని గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌లోనూ కేసీఆర్ ప్ర‌చారం చేసుకున్నారు. ఇప్పుడు గ్రేట‌ర్‌లోనూ బీసీల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. బీసీల‌కు ప్ర‌త్యేకంగా ప‌థ‌కాల‌ను కూడా అమ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బీసీ ఓటు బ్యాంకు.. కేసీఆర్‌కే అనుకూలంగా ఉంటుంద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ కు కూడా ఈ ఓటు బ్యాంకు అనుకూలంగా ఉంది. కానీ, ఎటొచ్చీ.. నేత‌ల మ‌ధ్య ఉన్న వివాదాలు విభేదాల‌తో కాంగ్రెస్‌పై బీసీల్లో న‌మ్మ‌కం స‌న్న‌గిల్లింది.

బీజేపీ విష‌యానికి వ‌స్తే.. అగ్ర‌వ‌ర్ణాలైన బ్రాహ్మ‌ణ‌, క‌మ్మ‌, కాపు వ‌ర్గాల్లో సానుకూల కోణం ఉన్న‌ప్ప‌టికీ సెటిల‌ర్లు మాత్రం బీజేపీని వ్య‌తిరేకిస్తున్నారు. దీంతో ఆయా వ‌ర్గాల్లో ప‌ట్టు పెంచుకునేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. కేసీఆర్ ప్ర‌త్యేకంగా ఏ వ‌ర్గాన్నీ టార్గెట్ చేయ‌క‌పోయినా.. అన్ని వ‌ర్గాల‌ను ప్రాధాన్యం ఇస్తున్నాన‌ని చెబుతున్నా.. బీసీ ఓటు బ్యాంకుపై ఆయ‌న కూడా వ్యూహాత్మ‌కంగానే పావులు క‌దుపుతున్నారు. బీసీలు ఎక్కువ‌గా ఉన్న చోట బీసీ మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అగ్ర‌వ‌ర్ణాలు ఉన్న చోట రెడ్డి సామాజిక వ‌ర్గానికి బాధ్యత‌లు అప్ప‌గించారు. వీరు ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు కూడా. మొత్తం గా గ్రేట‌ర్‌ను అధ్య‌య‌నం చేస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను బ‌ట్టి.. బీసీ వ‌ర్గాలు కేసీఆర్‌కే జై కొడుతున్నాయ‌నేది నిజ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ప్ర‌ధాని మోడీ రంగంలొకి దిగాక ఈ స‌మీక‌ర‌ణ‌లు మార‌తాయేమో.. చూడాలి. ఆయ‌న‌కూడా బీసీ కాబ‌ట్టి.. బీసీ సెంటిమెంటును రెచ్చ‌గొట్టే అవ‌కాశం ఉండే అవ‌కాశం ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News