మోడీ మాటను కేసీఆర్ ఎందుకు ఫాలో కావట్లేదు?

Update: 2020-04-20 18:30 GMT
చరిత్రలో మరెప్పుడూ చోటు చేసుకోని రీతిలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఎవరిళ్లలో వారు ఉండిపోవటం అది కూడా ఒకరోజో.. రెండురోజులో కాకుండా నెలల తరబడి ఉండిపోవటం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా చోటు చేసుకున్న ప్రత్యేక పరిస్థితులే దీనికి కారణం. తొలుత 21 రోజులు.. తర్వాత దాన్ని పొడిగిస్తూ మే మూడు వరకూ మరోసారి లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం సర్కారు.. ఇటీవల కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీంతో.. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్ని తెలంగాణ ప్రభుత్వం ఫాలో అవుతుందా? లేదా? అన్నది క్వశ్చన్ గా మారింది.

ఇదే అంశాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన కేసీఆర్ సర్కారు అందుకు తగ్గట్లే.. ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై.. గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించారు. లోతుగా చర్చించారు. ఎప్పుడైతే ఆదివారం మంత్రివర్గ సమావేశమని తేలిందో.. అప్పుడే కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఫాలో అయ్యే అవకాశం లేదని తేలిపోయింది. ఎందుకంటే.. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు జరిగినా.. కేసీఆర్ ప్రెస్ మీట్ మాత్రం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలోనే ఉంటుంది.

ఒకవేళ.. కేంద్ర మార్గదర్శకాలకు తగ్గట్లు మినహాయింపుల్ని తమ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన పక్షంలో.. అందుకు తగ్గ ఏర్పాట్లకు తగిన సమయం లభించదు. ఇదొక్క సంకేతం చాలు.. కేంద్ర మార్గదర్శకాల విషయంలో కేసీఆర్ సర్కారు ఫాలో కారన్న విషయాన్ని అర్థం చేసుకోవటానికి. ఈ అంచనాలకు తగ్గట్లే.. కేసీఆర్ ప్రెస్ మీట్ లో కేంద్ర మార్గదర్శకాల్ని ఫాలో కాకూడదని.. ఇప్పుడు అమలువుతున్న లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ప్రకటించారు. ఎందుకిలా? అన్న ప్రశ్న వేసుకుంటే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితినే చూసుకుంటే.. నాలుగు జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఒక కేసు నుంచి ఇరవై వరకూ కేసులు ఉన్నాయి. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ లో భారీగా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ మహానగరంలోనే ఎనభై శాతానికి పైగా కేసులు ఉండటాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ.. కేంద్ర మార్గదర్శకాల్ని ఫాలో అవుదామనే డిసైడ్ అయితే ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ.

ఎందుకంటే.. మినహాయింపుల్ని అమలు చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారు ఏదో కారణంతో రాజధాని హైదరాబాద్ నగరం వైపు రావటం మొదలవుతుంది. దీనికి తోడు భాగ్యనగరంలోనూ ప్రజలు పెద్ద ఎత్తున బయటకు రావటం షురూ అవుతుంది. అదే జరిగితే.. వైరస్ వ్యాప్తి పెద్ద ఎత్తున చోటు చేసుకుంటుంది. అలాంటి పరిస్థితే ఏర్పడితే.. లాక్ డౌన్ నిబంధనల్ని కటువుగా అమలు చేసిన ఫలాలు మొత్తం వేస్ట్ కావటమే కాదు.. పాజిటివ్ కేసులు మరింతగా పెరిగి పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇది మరిన్ని తలనొప్పులకు కారణమవుతుంది. ఈ కారణంతోనే కేంద్రం ప్రకటించిన మినహాయింపుల్ని ఫాలో కాకూడదని కేసీఆర్ సర్కారు డిసైడ్ చేసిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News