టీ మంత్రి వేముల రాష్ట్రపతిభవన్ కు ఎందుకు వెళ్లారు?

Update: 2021-02-20 05:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల గురించి తెలిసిందే. ఆయన ఏదైనా కల కన్నారంటే.. దాన్ని సాధించే వరకు నిద్రపోరు. ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత సచివాలయానికి వెళ్లిన ఆయనకు.. తాను నమ్మిన సెంటిమెంట్లకు అనువుగా సచివాలయం లేకపోవటం.. వసతుల విషయంలో ఆయన అంచనాలకు తగ్గట్లుగా లేకపోవటంతో.. ఆ చారిత్రక భవనాన్ని నేలమట్టం చేసి.. దాని స్థానే తాను కలగన్న సచివాలయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెల్లువెత్తిన విమర్శల్ని.. ఆరోపణల్ని లైట్ తీసుకోవటం కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుందని చెప్పాలి.

తన కలల పంట అయిన తెలంగాణ సచివాలయ భవనాన్ని నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్మాణం చేపట్టాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇందుకోసం ఆయన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు.. ఈ భవనాన్ని నిర్మిస్తున్న షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధితో పాటు.. ఆర్కిటెక్టు ను.. కార్యనిర్వాహఖ కమిషనర్ తో సహా ఒక టీంను మంత్రి వేముల ఢిల్లీకి తీసుకెళ్లారు.

అక్కడ రాష్ట్రపతి భవన్ ను.. పార్లమెంటు భవనంతో పాటు.. కేంద్రంలోని కీలక మంత్రులు కొలువు ఉండే సౌత్ బ్లాక్.. నార్త్ బ్లాక్ లను పరిశీలించారు. బ్రిటీషు కాలం నాటి ఈ భవనాలు నేటికి బలంగా ఉండటం.. వాటి నిర్మాణాలకు ఉపయోగించిన రాళ్లు.. వాటిని ఎక్కడ నుంచి తెప్పించారన్న వివరాల్ని సేకరిస్తున్నారు.

మొత్తానికి సారు కోరికను తీర్చటానికి పడుతున్న శ్రమ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కల ఎంత భారీగా ఉంటాయన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తాను నిర్మించే సచివాలయం అల్లాటప్పా అన్నట్లు కాకుండా.. అందుకు ఆయన చేస్తున్న కసరత్తు ఎంత భారీగా ఉంటుందన్న విషయం తాజాగా రాష్ట్రపతి భవన్ ను సందర్శించిన వైనాన్ని చూస్తే.. ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.
Tags:    

Similar News