గంటా ఎందుకు సైలెంట్ అయ్యారు...!

Update: 2019-11-04 05:44 GMT
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ అడుగులు ఎటు...? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి ఎదురు గాలి ఉన్నా సరే ఎమ్మెల్యేగా విజయం సాధించిన గంటా కాపు సామాజిక వర్గ౦లో బలమైన నేతగా ఉన్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటు తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకమైన విద్యాశాఖకు మంత్రిగా వ్యవహరించిన గంటా ఇప్పుడు పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది.

టీడీపీ నుంచి వరుసగా రెండో సారి విజయం సాధించిన ఆయన కోసం, అటు భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఆయన మౌనం వ్యూహాత్మకం అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆదివార౦ జనసేన పార్టీ నిర్వహించిన లాంగ్ మార్చ్ కి హాజరు కావాలని గంటాను చంద్రబాబు ఆదేశించారు. అయినా సరే గంటా మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు. సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు హాజరైనా సరే గంటా మాత్రం దూరంగా ఉన్నారు.

అసలు దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీకి ఆయన దూరంగా ఉన్నా సరే కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. సిఎం సొంత జిల్లా కడపకు ఇంచార్జ్ మంత్రిగా చేసిన గంటాకు... రాయలసీమలో ఉన్న బలిజ సామాజిక వర్గ నేతలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అలాగే గతంలో ప్రజారాజ్యంలో పని చేయడంతో ఆయనతో కొందరికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటీవల చిరంజీవిని వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి సైరా సినిమా చూపించిన సమయంలో గంటా ఉన్నారు. చిరుతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్ళారు.

అమిత్ షా తో కూడా గంటా మాట్లాడారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు ఆయన బిజెపిలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారని, వెళ్తూ వెళ్తూ తనతో మంచి సంబంధాలు ఉన్న కాపు నేతలను కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు టీడీపీకి, వైసీపీకి గంటా సమదూరం పాటిస్తూ బిజెపితో స్నేహం కోరుకుంటున్నారని, తద్వారా ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో ఏడాది తర్వాత అయినా సరే ఆయన కమల తీర్ధం పుచ్చుకోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. మరి ఈ ప్రచారంపై ఆయన ఎప్పుడు స్పందిస్తారో ? చూడాలి.
Tags:    

Similar News