ఢిల్లీ దాకా ఎందుకు గల్లీ అప్పుల లెక్క మాటేంది కేటీఆర్?

Update: 2023-01-31 09:26 GMT
నిద్ర లేచింది మొదలు అవకాశం వచ్చినా.. రాకున్నా.. కల్పించుకొని మరీ కేంద్రం మీద దునుమాడే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలోని పలు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి.. వాటి పరిష్కారం గురించి మాత్రం నోరు విప్పి మాట్లాడరన్న విమర్శ వినిపిస్తోంది. దీనికి తోడు.. సంచలనంగా మారిన కొన్ని ఉదంతాల మీదా ఆయన ఫోకస్ లేదంటున్నారు. పేరుకు ముఖ్యమంత్రే అయినా అయితే ప్రగతి భవన్.. లేదంటూ ఫామ్ హౌస్ లో ఉండే కేసీఆర్ టార్గెట్ ఇప్పుడు ఢిల్లీ తప్పించి.. గల్లీ ఇష్యూల మీద లేని వేళ.. కేటీఆరే అన్ని విషయాల్ని చూస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో రాష్ట్రంలోని పలువురు సర్పంచ్ లు నిధుల విడుదల కాక.. సొంత డబ్బులు ఖర్చు చేసి భారీగా అప్పుల పాలు అవుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి నాలుగు రాళ్లు వెనకేసుకోవటం సంగతి తర్వాత.. ఉన్న ఆస్తులు పోగొట్టుకొని భారీగా అప్పులు మూటగట్టుకొని కిందా మీదా పడిపోతున్న సర్పంచ్ లు ఈ మధ్యన ఎక్కువ అయ్యారు. నిత్యం గొప్పలు చెప్పే కేసీఆర్.. కేటీఆర్ లు రాష్ట్రంలో పేమెంట్ కోసం ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల సంగతి కాస్త చూడాలంటున్నారు. కానీ.. వాటి లెక్క తేల్చే విషయంలో మాత్రం కేసీఆర్ సర్కారు అస్సలు ఆసక్తి చూడటం లేదంటున్నారు.

ఇప్పటికే డెవలప్ మెంట్ పనుల కోసం కాంట్రాక్టులు పొంది.. పనులు పూర్తి చేసి.. ఆ బిల్లులు క్లియర్ కాక లబోదిబో మంటున్న బడా కాంట్రాక్టర్లు మొదలు.. ఉన్నపాటి పరిమిత నిధులతో పనులు కాక.. తమ స్థాయికి మించి అప్పులు చేస్తున్న సర్పంచ్ లకు రుణభారం అంతకంతకూ పెరుగుతోంది. అప్పులు ఇచ్చినోళ్ల మాటలు పడలేని వారు.. తీవ్ర నిర్ణయాలు తీసుకునే వరకు వెళుతున్నారు.

మొత్తంగా చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లుగా చెబుతున్నారు. ఎనిమిదిన్నరేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వేళ.. మిగులు బడ్జెట్ తో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బడ్జెట్ అంకెలు ఘనంగా ఉన్నప్పటికీ.. వాటి వెనకున్న అసలు లెక్కల్ని చూస్తే..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందన్న విషయం అర్థమవుతుందంటున్నారు. అందుకే.. ఢిల్లీ సింహాసనాన్ని చేతబట్టి.. దేశాన్ని చక్కబరుస్తానని చెప్పే కేసీఆర్.. ముందు గల్లీ సంగతులు చూసే బాగుంటుందంటున్నారు. అదే సమయంలో.. నిత్యం ప్రధాని మోడీని.. కేంద్రాన్ని టార్గెట్ చేసే మంత్రి కేటీఆర్.. ముందు రాష్ట్రంలోని పెండింగ్ బిల్లుల పంచాయితీని ఒక కొలిక్కి తెచ్చే పని చూడమంటున్నారు. మరి.. తండ్రి కొడుకులకు ఈ మాటలు వినపడే అవకాశం ఉందంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News