కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దాదాపుగా అందరి జీవన శైలిలో గణనీయమైన మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా పుణ్యమా అంటూ అందరూ ``టచ్ మీ నాట్...ఐ విల్ టచ్ యు ఇఫ్ నెససరీ....``అన్న ఫార్ములాకు వచ్చేశారు. నిత్యావసరాలు, కూరగాయలు, పాలు ఎట్సెట్రా వస్తువులను భౌతిక దూరం పాటిస్తూ భయం భయంగా కొనాల్సిన పరిస్థితి. ఇక, ఈ కరోనా కాలంలో బార్బర్ షాపుకు వెళ్లి క్రాఫ్, షేవింగ్ చేయించుకోవాలంటేనే చాలామంది హడలెత్తిపోతున్నారు. బార్బర్ షాపులకూ కేంద్రం కోవిడ్ నిబంధనలు విధించినా...అవి అంతటా అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో, చాలామంది ఇంట్లోనే ట్రిమ్మర్లు, షేవింగ్ కిట్లతో రకరకాల షేపుల్లో క్రాఫులు, గడ్డాలు చేసుకుంటూ...తమ పిల్లలకు ట్రిమ్మర్లతో క్రాఫ్ చేస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. క్రాఫ్ బాగా కుదిరితే తమ ఖాతాలో వేసుకుంటూ..కుదరకపోతే కొత్త ఫ్యాషన్ అని చెప్పుకుంటూ కవర్ చేసుకుంటున్నారట.
అయితే, అటు షాపులకు వెళ్లక....ఇటు ఇళ్లలోనే ట్రిమ్మర్లతో సొంత ప్రయోగాలు చేస్తే తమ మునుపటి క్రాఫ్, గడ్డం, మీసకట్టు స్టైల్ పోతుందని భయపడుతూ....చాలామంది మునుల్లాగా జుట్టు, గడ్డాలు, మీసాలు పెంచుకు తిరుగుతున్నారు. అయితే, ఇటువంటి వారి జాబితాలో మన దేశ ప్రధాని మోడీ కూడా చేరిపోయారని ఢిల్లీలోని గల్లీ గల్లీలో చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే ట్రిమ్డ్ క్రాఫ్, గడ్డంతో ప్రధాని మోడీ కనిపిస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో మోడీ...దాదాపుగా భుజాల పొడువాటి జుట్టు, బాగా పెరిగిన గడ్డంతో దర్శనమిస్తున్నారు. అయితే, దీని వెనుక రకరకాల కారణాలున్నాయంటూ జోరుగా చర్చించుకుంటున్నారు ఢిల్లీ వాసులు. అయితే, అయోధ్యలో రామ మందిర నిర్మాణం నేపథ్యంలో మోడీకి మొక్కు ఉందని, అందుకే ఆయన గడ్డం, జుట్టు పెంచుతున్నారని కొందరు అనుకుంటున్నారు.
వశిష్ట మునిలా కనిపించేందుకు మోడీ ఈ లుక్ లో కొనసాగుతున్నారని చెబుతున్నారు. ఇక, త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బెంగాలీలను ఆకట్టుకునేందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ లుక్ లో కనిపించాలని మోడీ గడ్డం, జుట్టు పెంచుతున్నారన్నది మరి కొందరి వాదన. ఇక, తన ఆస్థాన మంగలి ద్వారా క్రాఫ్, గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకుంటే కోవిడ్ సోకుతుందేమోనన్న భయంతోనే మోడీ ఈ లుక్ లో కనిపిస్తున్నాని మరికొందరు బల్లగుద్ది చెబుతున్నారు. ఆ నోటా, ఈ నోట పడి ఈ పుకార్లన్నీ మోడీగారి చెవిన పడ్డాయట. అవి విన్న ఆయన గట్టిగా నవ్వి ఊరుకున్నారట. మరి మోడీ సార్ క్రాప్, గడ్డం పెంచడం వెనుక పెంచడం వెనుక అసలు కారణమేమిటో ఆయనకు, ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి మరి.