ఆంధ్రా నేతలు తెలివైనోళ్లు అయితే.. కేసీఆర్ సాఫ్ట్ వేర్ కు చెక్ పెట్టగలరా?

Update: 2019-04-10 07:19 GMT
అదేం దరిద్రమో కానీ.. ఆంధ్రోళ్లు అంత తెలివైనోళ్లు.. ఇంత పోటుగాళ్లు.. మరెంతో పీకుడుగాళ్లు అంటూ అదేపనిగా స్వమర్దనం చేసుకోవటమే కానీ.. ఇప్పటివరకూ వారి తెలివికి సంబంధించి.. వారి మంత్రాగానికి సంబంధించిన ఒక్క పని కూడా కనిపించదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్లు చక్రం తిప్పి తెలంగాణను తొక్కేసినట్లుగా వాదనలు జోరుగా వినిపిస్తూ ఉంటాయి. మరి.. అంతలా చక్రం తిప్పే మొనగాళ్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. అది కూడా ఏకపక్షంగా ఎలా అన్న సందేహానికి మాత్రం సమాధానం చెప్పే వారు కనిపించరు.

నిజానికి అసలుసిసలు తెలివైన నాయకులు ఎవరంటే తెలంగాణకు చెందిన వారే. వారికి తెలంగాణ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ ఉండవు. కానీ.. ఏపీ నేతల పరిస్థితి అలా కాదు. నిద్ర లేచింది మొదలు వారికి వ్యాపారాలు.. ఆస్తులు పెంచుకునే కార్యక్రమం లాంటివి చాలానే ఉంటాయి. అన్నింటికి మించి ఏపీకి చెందిన నేతల్లో నూటికి 85 శాతం మందికి హైదరాబాద్లో బోలెడన్ని ఆస్తులు ఉంటాయి.

అలాంటప్పుడు ఏపీ ప్రయోజనాల గురించి వారు నోరు విప్పే పరిస్థితే ఉండదు. ఏమైనా తోక జాడిస్తే కత్తిరించటానికి పెద్ద కత్తెర పట్టుకొని కేసీఆర్ సిద్ధంగా ఉంటారన్నది మర్చిపోకూడదు. ఏపీని ఎలా తొక్కి పెట్టాలన్న విషయంపై డాక్టరేట్ చేసిన కేసీఆర్ కు.. ఏపీ నేతల మైండ్ సెట్ బాగా తెలుసు. వారిని ఎలా ఆడుకోవాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికి తెలీదు. ఏపీ నేతల పేరుతో ఏపీ ప్రజలను అవసరానికి తగ్గట్లు నాలుగు మాటలు అనేసి తెలంగాణలో భావోద్వేగాన్ని పండించి తన పబ్బం గడుపుకునే కేసీఆర్ మాష్టారి సాఫ్ట్ వేర్ ను డీ కోడ్ చేసే మొనగాడు ఎవరూ లేరని చెప్పాలి.

నిత్యం తాము గొప్పొళ్లమన్న మాటల్ని గొప్పగా చెప్పుకునే ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతలు.. ఆ ఊహలో బతికేసే వారిలో ఒక్కరైనా సరే.. కేసీఆర్ మాటలకు.. ఆయన ఎత్తుగడలకు చెక్ చెప్పే తెలివైన నేత ఒక్కరంటే ఒక్కరైనా ఉన్నారా? అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే.. మీరు మా గొప్పొళ్లే. ఇంకెందుకు ఆలస్యం.. తెలివైన.. కేసీఆర్ కు మించినోడిని వెతుకులాట మొదలెట్టండి.. అప్పుడు మీకే అర్థమవుతుంది అసలు విషయం.


Tags:    

Similar News