ఏపీకి కేసీఆర్‌ ప్రత్యేక హోదా తెస్తారా.. వాట్‌ ఏ కామెడీ!

Update: 2023-01-03 03:29 GMT
టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చి కేంద్రంలో అధికారంలోకి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పెద్ద కలలే కంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క కీలక నేత కూడా బీఆర్‌ఎస్‌ లో చేరలేదు. తాజాగా చేరిన తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌ బాబు సైతం  ప్రజారాజ్యం, జనసేన, వైసీపీ, టీడీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీల్లో చేరి ఇక ఎక్కడా అవకాశం లేక బీఆర్‌ఎస్‌ లో చేరినవాళ్లేనని అంటున్నారు.

కాగా ఏపీలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఏపీ ప్రత్యేక హోదా తెస్తామని బీఆర్‌ఎస్‌ ఏపీ నూతన అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ చెబుతున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో భారీగా సెటైర్లు పడుతున్నాయి. ఇది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద జోక్‌ అని నెటిజన్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2014లో టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. బీజేపీకి సైతం తమ ప్రభుత్వంలో మంత్రులుగా చాన్సు ఇచ్చింది. దేవదాయ శాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్‌ çకు చంద్రబాబు అవకాశమిచ్చారు. అంతేకాకుండా బీజేపీ అడిగిందని చెప్పి ఆ పార్టీ నేత సురేష్‌ ప్రభుకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చారు.  ఏపీలో ఆ పార్టీకి బలం లేకపోయినా సోము వీర్రాజు లాంటివారికి ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చారు.

2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా మిత్రపక్షంగా వ్యవహరిస్తూ అన్నింటిలోనూ టీడీపీ మద్దతు ఇచ్చింది. చివరకు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ నేతలు అశోక్‌ గజపతిరాజు కేంద్ర కేబినెట్‌ మంత్రిగా, సుజనా చౌదరి సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. అయినా ప్రత్యేక హోదా రాలేదు.

ఇక 2019లో వైసీపీ రాష్ట్రంలో అదికారంలోకి వచ్చింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అడిగినా, అడకగపోయినా ప్రతి విషయంలోనూ, పార్లమెంటు వివిధ బిల్లుల ఆమోదం అప్పుడు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ ఇలా అన్నింటిలోనూ వైసీపీ ఎదురెళ్లి మరీ మద్దతిచ్చింది. అయినా మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వం తమతో ఎంత విదేయంగా వ్యవహరించినా మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏపీ విభజన సమస్యలనే పరిష్కరించలేదు.

చంద్రబాబు, జగన్‌ ప్రభుత్వాలు మోడీ ప్రభుత్వంలో ఇంత సన్నిహితంగా వ్యవహరిస్తేనే రాని ప్రత్యేక హోదా తెల్లారి లేస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే కేసీఆర్‌ వల్ల అవుతుందా? అవుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతుండటం మంచి జోక్‌ కాక మరేమిటి అని విశ్లేషకులు, నెటిజన్లు నిలదీస్తున్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన తన ఆగర్భ శత్రువు అన్నట్టు కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. అంతా సవ్యంగా ఉంటేనే మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు.. ఇక కేసీఆర్‌ లాంటి తన ప్రత్యర్థి వచ్చి అడిగితే ఇచ్చేస్తారా?

తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్‌ఎస్‌ ను కాంగ్రెస్‌ లో విలీనం చేస్తానని సోనియాగాంధీకి అప్పట్లో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అసలు ఇదే షరతుపై సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించారంటారు. అయితే ఆ తర్వాత కేసీఆర్‌ ఏం చేశారో అందరూ చూశారు.

ఇక టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో గెలిచాక దళితుడికే ముఖ్యమంత్రి పదవి అని కేసీఆర్‌ పలుమార్లు చెప్పారు. ఈ విషయంలోనూ మాట తప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను సంతల్లో పశువులను కొన్నట్టు కొనుగోలు చేసి.. ప్రజాస్వామ్యానికి పాతరేసి ప్రశ్నించే పార్టీలే లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌ దేనని విమర్శలున్నాయి. అలాంటి వ్యక్తి నేడు ఏపీకి ప్రత్యేక హోదా తెస్తాడని ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు, తెలంగాణ మంత్రులు చెబుతుండటంపై సెటైర్లు ఓ రేంజులో పడుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News