టీడీపీ భారీ ఆఫర్ కి పవన్ ఒప్పుకుంటారా...?

Update: 2022-09-22 02:30 GMT
ఏపీలో పొత్తుల ఎత్తులు మొదలైపోయాయి. ఈసారి అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ చేయాల్సింది అంతా చేస్తోంది. దాంతో పాటు ఎట్టి పరిస్థితులలోనూ  పొత్తులతోనే వెళ్లాలని కూడా గట్టిగా నిర్ణయించుకుంది. జనసేనను తమతో కలుపుకుని పోవడానికి చూస్తోంది. అయితే జనసేన నుంచి కొన్ని కండిషన్లు ఉన్నాయి. అవి ఆమోదిస్తేనే పొత్తులు కుదిరేది అని అంటున్నారు.

ఏపీలో అత్యధిక జనాభా ఉన్న కాపులకు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవి అన్నది దక్కలేదు. ఆ లోటుని తీర్చడానికి ప్రజారాజ్యం ప్రయోగం మొదట జరిగింది. కానీ అది ఫెయిల్ అయింది. ఇపుడు సరైన రాజకీయ  అవకాశం అని జనసేన గట్టిగా భావిస్తోంది. పవన్ కళ్యాణ్ణి సీఎం గా చూడాలని ఏపీలో  బలమైన సామాజిక వర్గం ఎదురుచూస్తోంది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా కూడా అన్నీ మరచి అడుగులు వేస్తోంది.

అయితే ఏపీలో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ జరిగితే ఎలా ఉంటుంది. పొత్తులు ఉంటే ఎలా ఉంటుంది అన్న దాని మీద జనసేన తన మటుకు తాను సొంతంగా అధ్యయనం  చేస్తోంది. అలాగే తన సర్వేలు తాను చేయించుకుంటోంది. గట్టిగా నలభై సీట్లు గెలిస్తే చాలు తెలుగు కుమారస్వామి పవన్ అవడం ఖాయమని కూడా లెక్కలు వేసుకుంటోంది. ఇపుడు కళ్ల ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండే కూడా జనసేనకు ఆశాకిరణాలుగా ఉన్నారని చెబుతున్నారు.

ఈ ఇద్దరికీ సొంతంగా పెద్దగా ఎమ్మెల్యేలు లేకపోయినా సీఎంలు అయ్యారంటే రాజకీయ అనివార్యత అలాంటిది అని జనసేన ఊహిస్తోంది. అలాంటి అనివార్యతను ఏపీలో క్రియేట్ చేయాలని అనుకుంటోంది. అలాగని ఏపీలో నేల విడిచి సాము చేయరాదని కూడా భావిస్తోంది. పొత్తులు కనుక తమకు ఆమోదయోగ్యంగా కుదిరితే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఆ దిశగా అడుగులు వేయాలని కూడా చూస్తోంది.

ఏపీలో టీడీపీతో పొత్తులు కుదురుతాయన్న భావన జనసేనలో కూడా ఉంది. అదే కనుక జరిగితే వైసీపీని మొత్తానికి మొత్తం తుడిచి పెట్టవచ్చు అన్న ధీమా కూడా ఆ పార్టీకి ఉంది. ఇదిలా ఉంటే టీడీపీ కూడా ఇదే రకమైన ఆలోచనల్లో ఉంది. జనసేనకు ఉన్న క్రేజ్ ని తమ వైపునకు తిప్పుకుంటే టీడీపీ గెలుపు ఖాయమని నమ్ముతోంది. అయితే అధికారంలో వాటా అంటూ జనసేన నుంచి వస్తున్న షరతులే ఆ పార్టీకి చికాకు పరుస్తున్నాయని అంటున్నారు.

దాంతో వయా మీడియాగా ఒక ప్రతిపాదన అయితే ఆ పార్టీ నుంచి కొత్తగా వస్తోంది అని ప్రచారం సాగుతోంది. అదేంటి అంటే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆయన కోరుకున్న సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది అని అంటే నలభై దాకా జనసేన కోరుకుంటోంది. ఆ సంఖ్యకు అటు ఇటుగా ముప్పయి అయిదు వరకూ ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉందని చెబుతున్నారు.

సీట్ల వరకూ బాగా ఉన్న పవన్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ప్రతిపాదన మాత్రం జనసేనకు పెద్దగా రుచించదనే అంటున్నారు. డిప్యూటీ సీఎం లకు ఒకపుడు విలువ ఉండేది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఇద్దరిని తీసుకుని వారు కూడా మామూలే అనిపించేశారు. జగన్ అయితే ఏకంగా అయిదుగురికి ఆ పదవి ఇచ్చి డిప్యూటీలను పెంచేశారు. దాంతో ఒకప్పటి గ్లామర్ అయితే ఈ పోస్ట్ కి లేదు.

పైగా ఏ పదవి అయినా కూడా నిర్ణయాలు అన్నీ కూడా సీఎం స్థాయిలోనే తీసుకుంటారు. ఒకనాడులా మంత్రులు తమ భాగస్వామ్యాన్ని  చాటుకునేలా పరిస్థితులు లేవు. ఆ మాత్రం భాగ్యానికి పేరుకు పదవి ఎందుకు అన్న చర్చ అయితే ఉందిట. దాంతో ఇస్తే సీఎం పదవినే గట్టిగా డిమాండ్ చేయాలని జనసేన ఉందిట.

తమకంటే టీడీపీకే ఈ ఎన్నికలు రాజకీయ అవసరం కాబట్టి గట్టిగా పట్టుబడితే అధికారం షేరింగ్ కి ఆ పార్టీ దిగి వస్తుందని అలా పవన్ సీఎం కావడం ఖాయమని జనసేనలో అంచనా వేస్తున్నారుట. ఈ ప్రచారాలు ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం నిజమనే రెండు పార్టీల నుంచి వినిపిస్తున్న మాట. కచ్చితంగా 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునే పోటీ చేస్తాయని అంటున్నారు. చూడాలి మరి జనసేన  కండిషన్లు అప్లై అవుతాయా కావా అన్నది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News