కొత్త‌గూడెం నుంచి టీఆర్ఎస్ త‌ర‌ఫున పొంగులేటి పోటీ చేస్తారా?

Update: 2022-07-17 02:30 GMT
తెలంగాణ‌లో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని కొత్త‌గూడెం అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున 2014లో ఖ‌మ్మం ఎంపీగా గెలుపొందారు.

ఆ త‌ర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్ప‌టి నుంచి ఖాళీగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పొంగులేటి శ్రీనివాస‌రెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం సీటు ఇవ్వ‌లేదు. ఖ‌మ్మం ఎంపీగా ఉన్న ఆయ‌న‌ను కాద‌ని టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వ‌ర‌రావుకు సీటు ఇచ్చింది.

ఆ త‌ర్వాత పొంగులేటికి రాజ్య‌స‌భ‌, ఎమ్మెల్సీ ఇలా ఏదో ఒక అవ‌కాశం వ‌స్తుంద‌ని ప్ర‌తిసారి వార్త‌లు రావ‌డం, ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఇప్ప‌టికే పొంగులేటి అనుచ‌రులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంక‌టేశ్వ‌ర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో పొంగులేటి కూడా కాంగ్రెస్ లో చేర‌తారని వార్త‌లు వ‌చ్చాయి. అయితే టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించ‌డంతో ఏ పార్టీలో చేర‌కుండా టీఆర్ఎస్ లోనే అలా ఉండిపోయారు.

మ‌రోవైపు గ‌త ఎన్నిక‌ల్లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వ‌న‌మా టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. గతంలో వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన‌ప‌రిష‌త్, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఆయ‌న హ‌యాంలోనే 108 అంబులెన్సులు ప్రారంభ‌మ‌య్యాయి.

కాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌ఫున వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుకు సీటు ద‌క్క‌ద‌ని అంటున్నారు. వ‌న‌మా కుమారుడు రాఘ‌వేంద్ర ఇటీవ‌ల దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌య్యాడ‌ని భారీ ఎత్తున విమ‌ర్శ‌లు రేగాయి. ఈ వ్య‌వ‌హారంలో రాఘ‌వేంద్ర జైలుపాల‌య్యాడు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌న‌మా వెంకటేశ్వ‌ర‌రావుకు సీటు ద‌క్క‌ద‌ని అంటున్నారు. దీంతో పొంగులేటి శ్రీనివాస‌రెడ్డికి సీటు ఇస్తామ‌ని టీఆర్ఎస్ అధిష్టానం హామీ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News