జీతం పెరుగుతుంది కదా.. .జాకెట్ యాడ్ ఇవ్వొచ్చుగా?

Update: 2022-02-04 01:03 GMT
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న కొత్త పీఆర్సీ పంచాయితీ చూస్తుండగానే చిలికి చిలికి గాలి వానలా మారటం తెలిసిందే. కొత్త పీఆర్సీ ప్రకటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వెలువడే సమయంలో.. సంతోషంతో చప్పట్లు కొట్టటమే కాదు.. ఆత్మీయ ఆలింగనాలతో పాటు.. పండుగ వాతావరణం నెలకొనటం తెలిసిందే. అలాంటిది.. రోజులు గడిచేసరికి.. ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన రీతిలో బెజవాడ దుర్గమ్మ సాక్షిగా చేపట్టిన నిరసన ర్యాలీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటివరకు విషయం ఏదైనా సరే.. తనదే పైచేయిని ప్రదర్శించిన ఏపీ సర్కారు.. తాజాగా పీఆర్సీ ఎపిసోడ్ లో మాత్రం భిన్నమైన అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ ఇష్యూకు సంబంధించి చూస్తే.. తమకు కొత్త పీఆర్సీ వద్దని.. పాతదే ఇవ్వాలని ఉద్యోగులు కోరుతుంటే.. ప్రభుత్వం మాత్రం ససేమిరా అనటం తెలిసిందే. అంతేకాదు.. ప్రభుత్వం ఇస్తానన్న కొత్త జీతం స్థానే పాత జీతాలు ఇవ్వాలన్న మాట విస్మయానికి గురి చేస్తోంది. ఎక్కడైనా సరే పాత జీతాలు వద్దని.. కొత్త జీతాలు ఇవ్వాలన్న డిమాండ్ చేస్తారు. అందుకు భిన్నంగా ఏపీ ఉద్యోగుల డిమాండ్ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నట్లుగా కొత్త జీతాల కారణంగా ప్రభుత్వం మీద రూ.10వేల కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం చెబుతుంటే.. ఆ భారం ఎందుకు.. మాకు పాత జీతాలే ఇవ్వండి.. మీ మీద భారం దింపుకోండని ప్రభుత్వ ఉద్యోగులు కౌంటర్ ఇస్తున్నారు. మీరెన్నిచెప్పినా.. పాత జీతాలు ఇచ్చేది లేదు.. ఇకపై అన్ని కొత్త జీతాలే అంటూ ప్రభుత్వం తేల్చేసిన నేపథ్యంలో.. ఉద్యోగులు నిరసన ర్యాలీని నిర్వహించటం.. ప్రభుత్వ ఉద్యోగులు.. టీచర్లు లక్షలాదిగా విజయవాడకు తరలిరావటంతో ప్రస్తుతం సీన్ మొత్తం మారిన పరిస్థితి.

తాజా నిరసన ర్యాలీతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినప్పటికీ.. కొత్త పీఆర్సీ మీద ప్రభుత్వంతో చర్చలు జరపాలని.. జీతాలుపెరుగుతాయని వాదిస్తున్న ప్రభుత్వం తీరుపై కొందరు ఉద్యోగులు చేస్తున్న వాదనలు ఆసక్తికరంగా మారాయి. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ప్రభుత్వం అమలు చేసే పథకాలపై దినపత్రికల్లో భారీ ఎత్తున జాకెట్ యాడ్లు ఇస్తున్నారు కదా? జీతాలు పెరగటమేకానీ తగ్గలేదన్న విషయాన్ని అర్థమయ్యేలా జాకెట్ యాడ్లు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు చేస్తున్న ఈ కొత్త డిమాండ్ కు ఏపీ ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా స్పందిస్తే ఇష్యూ ఒక కొలిక్కి వస్తుంది కదా?
Tags:    

Similar News