గులాబీ పార్టీ ఆఫీస్ కోసం రూ.100 కోట్ల ల్యాండ్ కేటాయిస్తారా?

Update: 2022-05-12 03:29 GMT
టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం కోసం కేసీఆర్ సర్కారు కేటాయించిన దగ్గర దగ్గర ఎకరం భూమిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. ఎంత అధికారంలో ఉంటే మాత్రం.. రూ.వంద కోట్ల విలువైన భూమిని.. అది కూడా నగరం నడిబొడ్డున పార్టీ ఆఫీసు కోసం కేటాయింపులు జరుపుకుంటారా? అంటూ మండిపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం కోసం ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బంజారాహిల్స్ లో 4539 గజాల భూమిని టీఆర్ఎస్ పార్టీ కబ్జా చేయటం దారుణమని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.

"ఇది ముమ్మాటికి అధికారిక భూ కబ్జా. రౌడీలు బెదిరంచి భూ కబ్జాలు చేస్తే.. టీఆర్ఎస్ మాత్రం తన అధికారాన్ని దుర్వినియోగం పరిచి దొడ్డిదారిన జీవోలు తెచ్చి అత్యంత ఖరీదైన భూముల్ని కబ్జా చేస్తున్నారు" అంటూ మండిపడ్డారు.

ప్రభుత్వం వస్తుందో రాదో అన్న భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బడుగు.. బలహీన వర్గాలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో మాటలు చెప్పే కేసీఆర్ ప్రభుత్వం.. తమ వరకు వచ్చేసరికి మాత్రం తమకు అనుకూలంగా పనులు చేసుకోవటాన్ని తప్పు పడుతున్నారు.

'డబుల్ బెడ్రూం ఇంటి పథకానికి భూములు లేవు. దళితులకు మూడు ఎకరాల పథకానికి భూములు లేవు. కుల సంఘాలకు ఊరు చివర వెలి వేసినట్లుగా భూకేటాయింపులు జరిపారు. టీఆర్ఎస్ కు మాత్రం రూ.100 కోట్ల విలువైన భూమిని.. అది కూడా బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లో కేటాయిస్తారా? బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ లో ఉన్న భూములన్ని టీఆర్ఎస్ నాయకులు దోచుకుతిన్నారు' అని మండిపడ్డారు.

వేలాది కోట్ల రూపాయిల విలువైన ఫిలింనగర్ భూముల్ని రెడ్ ఫోర్ట్ అనే కంపెనీ పేరుతో ఎంపీ రంజిత్ రెడ్డికి కట్టబెట్టారన్నారు. "రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు వ్యాపారం కోసం అసైన్డ్ భూములను  లాక్కొంటుండ్రు. స్వాతంత్ర సమరయోధుల భూములను దౌర్జన్యంగా లాక్కొంటుండ్రు. అతి తక్కువ  వయసున్న టీఆర్ఎస్  పార్టీ ఆస్తీ రూ.816 కోట్లకు ఎలా చేరింది? రాష్ట్ర కార్యాలయానికి కూతవేటు దూరంలో జిల్లా కార్యాలయమా? ఎవడబ్బ సొమ్ము ఇది" అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను గెలిస్తే నియోజకవర్గంలోని 10 వేల మందికి ఇళ్లు కట్టిస్తానని చెప్పి.. ఒక్క ఇంటిని కూడా కట్టివ్వలేదన్నారు. పేదల ఇండ్లకు భూములు దొరకటం లేదు కానీ.. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు మాత్రం భూమి దొరకటమా? అంటూప్రశ్నించారు. టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా పార్టీ ఆఫీసు కోసం చేసిన భూ కేటాయింపు అక్రమమని.. దాన్నివెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఆ స్థలంలో డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇవ్వాలన్నారు. చూస్తుంటే.. టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా పార్టీ ఆఫీసు కోసం చేసిన కేటాయింపుల రగడ అంతకంతకూ పెరిగే సూచనలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News