ఆఫీసుకు ఐటీ ఉద్యోగులు.. అప్పుడే కాదట

Update: 2022-08-07 13:30 GMT
హైదరాబాద్‌లోని ఐటీ సంస్థలు ఉద్యోగులతో కళకళలాడేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. గతంతో పోలిస్తే.. కరోనా తగ్గుముఖం పట్టినా అత్యధిక సంస్థలు ఉద్యోగులను పూర్తిస్థాయిలో కార్యాలయానికి పిలవడం లేదు. వాస్తవానికి జులై చివరి నాటికే ఐటీ కంపెనీలు ఉద్యోగులను పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశాయి. మారిన పరిస్థితులతో ఇది సాధ్యం కావడం లేదు.

ఎక్కువ మంది ఉద్యోగులు పూర్తిస్థాయిలో కార్యాలయంలో పని చేసేందుకు విముఖత వ్యక్తం చేయడం, కరోనా నేపథ్యంలో కొన్ని సంస్థలు కార్యాలయం ప్రాంగణాన్ని కుదించడం, ఒకసారి అందరితో పని చేయించే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణాలు. ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్‌ పని విధానాన్ని పొడిగిస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకూ ఇదే పరిస్థితి ఉండే అవకాశముందని ఐటీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గడంతో అత్యధికంగా టెలికాం, కన్సల్టింగ్‌ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తిరిగి కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయంలో ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో అత్యధికులు ఇంటి నుంచే పని చేస్తున్నారని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ కొలియర్స్‌ ఇండియా, కో–వర్కింగ్‌ ఆపరేటర్‌ ఆఫిస్‌ సంయుక్తంగా మే–జూన్‌లో చేపట్టిన సర్వేలో తేలింది.

సర్వే ప్రకారం.. ఫిబ్రవరి నుంచి కొవిడ్‌ కేసులు క్షీణించడంతో కార్యాలయాలకు ఉద్యోగుల రాక పెరిగింది. ఫలితంగా 34 శాతం కంపెనీలకు చెందిన ఉద్యోగుల్లో 75–100 శాతం మంది ఆఫీసులకు వచ్చి (హైబ్రిడ్‌తో కలిపి) విధులు నిర్వర్తిస్తున్నారు. 25 శాతం మంది మాత్రమే కార్యాలయానికి వచ్చి పని చేస్తున్నట్టు 41 శాతం కంపెనీలు వెల్లడించాయి. టెలికం, కన్సల్టింగ్‌ రంగాల్లో 75–100 శాతం, ఐటీ, నూతన తరం సాంకేతిక రంగాల్లో 25 శాతం వరకు ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వచ్చి విధులు చేపడుతున్నారు.  

హైబ్రిడ్‌ విధానానికి 53 శాతం కంపెనీలు సై అంటున్నాయి. కార్యాలయం వికేంద్రీకరణ విధానాన్ని స్వీకరించనున్నట్లు 74 శాతం కంపెనీలు వెల్లడించాయి. వికేంద్రీకరణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్స్‌ సెంటర్లను అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నట్టు 49 శాతం కంపెనీలు తెలిపాయి.పనిచేయడానికి అనువుగా ఉండే ఫ్లెక్సిబుల్‌ స్థలం మెట్రోయేతర నగరాల్లో 2022 డిసెంబర్‌ నాటికి రెండింతలకుపైగా అధికమై 55 లక్షల చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా.

వర్క్‌స్పేస్‌ వ్యూహం కింద 77 శాతం కంపెనీలు ఫ్లెక్స్‌ స్పేస్‌ను భాగంగా చేసుకుంటాయని కొలియర్స్, ఆఫిస్‌ వెల్లడించాయి.2022 జనవరి–జూన్‌లో 2.75 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని వివిధ కార్యాలయాలు అద్దెకు తీసుకున్నాయి. గతేడాది జనవరి–జూన్‌లో ఇది 1.03 కోట్ల చదరపు అడుగులు మాత్రమే. ఫ్లెక్సిబుల్‌ వర్క్‌స్పేస్‌ వాటా 13 శాతంగా ఉంది.  

ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజనీరింగ్, తయారీ రంగాలకు చెందిన కంపెనీలు సర్వేలో పాలుపంచుకున్నాయి. గరిష్టంగా ఈ కంపెనీల్లో 10,000 వరకు సిబ్బంది ఉన్నారు. సీఈవోలు, సీవోవోల వంటి కీలక వ్యక్తుల నుంచి 150కిపైగా స్పందనల ఆధారంగా నివేదిక ను విడుదల చేశాయి.
Tags:    

Similar News