య‌న‌మ‌ల‌కు మంగ‌ళం.. ఇక రాజ్య‌స‌భ‌కే!

Update: 2017-11-29 09:08 GMT
ఏపీ టీడీపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంటోంది! దాదాపు 37 ఏళ్లుగా రాష్ట్ర టీడీపీతో ప్ర‌త్యేక అనుబంధాన్ని ఏర్ప‌రుచుకున్న కీల‌క నేత‌ - సీనియ‌ర్ మోస్ట్ ప్ర‌స్తుత ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు గుడ్ బై చెప్ప‌నున్నార‌నే విష‌యం ఖాయ‌మై పోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ వార్త‌ల‌పై ఊగిస‌లాట కొన‌సాగినా.. నిన్న‌టి నిన్న జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై య‌న‌మ‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మిస్తున్నార‌నే వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూర్చించింది. వాస్త‌వానికి అన్న నంద‌మూరి తార‌క రామారావు పార్టీ పెట్టినప్ప‌టి నుంచి య‌న‌మ‌ల టీడీపీలో కొన‌సాగుతున్నారు.

ఇక‌, 1990ల‌లో టీడీపీలో జ‌ర‌గిన అధికార మార్పు స‌మ‌యంలో య‌న‌మ‌ల కీలకంగా వ్య‌వ‌హ‌రించి టీడీపీ చంద్ర‌బాబుకు ద‌క్కేలా చ‌క్రం తిప్పారు. ఆ త‌ర్వాత స్పీక‌ర్‌గా కూడా య‌న‌మ‌ల ప‌నిచేశారు.  అధికారంలో లేని స‌మ‌యంలోను పార్టీని అంటిపెట్టుకుని సేవ‌లందించారు. ఈ క్ర‌మంలోనే 2014లో పార్టీ అధికారంలోకి రాగానే చంద్ర‌బాబు ఈయ‌న‌కు అత్యంత కీల‌క‌మైన ఆర్థిక శాఖ‌ను అప్ప‌గించారు. అయితే, ఇటీవ‌ల తూర్పు గోదావ‌రి జిల్లాలో పాలిటిక్స్ పెరిగిపోతున్నాయ‌ని, ముఖ్యంగా య‌న‌మ‌ల సోద‌రుడు ప‌ళ్ల కృష్ణ అన్న‌గారి అధికారాన్ని అడ్డు పెట్టుకుని హ‌వా చ‌లాయిస్తున్నాడ‌ని పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌చ్చాయి.

అదేవిధంగా కాకినాడ కార్పొరేష‌న్ మేయ‌ర్ ఎంపిక విష‌యంలోనూ య‌న‌మ‌ల సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చార‌ని, ఫ‌లితంగా అక్క‌డ పార్టీలో తీవ్ర విభేదాలు పొడ‌సూపాయ‌ని కూడా వార్త‌లు వెల్లువెత్తాయి. ఇక‌, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డంలోను, జీఎస్టీ వంటి కీల‌క అంశాల్లో.. రాష్ట్రం పొందాల్సిన మిన‌హాయింపుల విష‌యంలోను కేంద్రం వ‌ద్ద య‌న‌మ‌ల స‌రైన బాణీ వినిపించ‌లేద‌నే టాక్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఇక‌, య‌న‌మ‌ల‌ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌ని సోష‌ల్ మీడియా స‌హా సైట్ల‌లోను క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, వీటికి స‌రైన ఆధారాలు ల‌భించ‌లేదు. కానీ, తాజాగా డైరెక్ట్‌గా య‌న‌మ‌లే త‌న భ‌విష్య‌త్తు గురించి వివ‌రించారు.

అవకాశం లభిస్తే రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌కు వెళ్లేందుకు సిద్దమని ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే, తాను ఎక్కడ ఉండాలన్నది తన ఒక్కడి నిర్ణయం కాదని, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. అది కావాలి... ఇది కావాలి అని తానెప్పుడూ పార్టీ అధిష్టానాన్ని అడగలేదని అన్నారు. 35 ఏళ్లు రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన తనది సుదీర్ఘ అనుభవమని చెప్పారు. నా అవసరం ఎక్కడ ఉంటుందన్నది అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. అయితే, చంద్ర‌బాబు వ్యూహం తెలుసుకునే య‌న‌మ‌ల ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని విశ్లేష‌కుల మాట‌. టీడీపీలో ఏదైనా ముందు ఇలాగే ప్ర‌క‌టిస్తార‌ని, ఆ త‌ర్వాత కొద్ది రోజుల్లో ఇవే నిజాలు అవుతాయ‌ని, జ‌నాల్ని ప్రిపేర్ చేయ‌డం కోసం ముందు కొన్ని లీకులు ఇవ్వ‌డం టీడీపీలో స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని అంటున్నారు. సో.. య‌న‌మ‌ల ఇక‌, ఢిల్లీ బాట‌ప‌డ‌తార‌న‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News