గోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థి ఫిక్స్‌!

Update: 2022-11-02 12:30 GMT
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 175కి 175 సీట్లు సాధించాలని కృతనిశ్చయంతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారు. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన 23 సీట్లపై జగన్‌ గురిపెట్టారు. ఈ 23లో ఇప్పటికే నలుగురు.. వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరిధర్‌ (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌ (విశాఖ సౌత్‌) వైసీపీతో అంటకాగుతున్నారు.

ఈ నాలుగు పోనూ మిగిలిన 19 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారని తెలుస్తోంది. అందులోనూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గట్టి అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలో జనసేన ప్రభావం ఉంటుందని స్పష్టమవుతున్న ఉభయగోదావరి జిల్లాలపై జగన్‌ ప్రత్యేక ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. ఈ జిల్లాల్లో ఈసారి వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పవని పలు అంచనాలున్న నేపథ్యంలో గట్టి అభ్యర్థుల ఎంపికపైన ఆయన దృష్టి సారించారు.

ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి తోట త్రిమూర్తులు బరిలోకి దిగడం ఖాయమైందని చెబుతున్నారు. తోట త్రిమూర్తులు కాపు సామాజికవర్గానికి చెందిన నేత. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి గతంలో టీడీపీ తరఫున, ఇండిపెండెంట్‌గా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రికార్డు ఉంది.

గత ఎన్నికల్లో టీడీపీ తరఫున రామచంద్రాపురం నుంచి బరిలోకి వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైఎస్‌ జగన్‌ ఆయన ప్రాధాన్యతను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. అంతేకాకుండా మండపేట నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ను కూడా చేశారు.

మరోవైపు గత ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ తరఫున పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావుపై ఓడిపోయారు. మండపేటలో టీడీపీ బలంగా ఉంది. 2009 నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు గెలుపొందుతూ వస్తున్నారు. వేగుళ్ల జోగేశ్వరరావు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు.

ఈ నేపథ్యంలో ఆయనపై వైసీపీ తరఫున తోట త్రిమూర్తులను మండపేట నుంచి బరిలోకి దింపాలని జగన్‌ యోచిస్తున్నారు. మరోవైపు మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం కూడా ఎక్కువే. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వేగుళ్ల లీలాకృష్ణ ఇక్కడ 35 వేలకు పైగా ఓట్లు సాధించడం గమనార్హం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News