వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఎమ్మెల్యేల ఫైట్

Update: 2021-01-22 16:30 GMT
ఏపీలో అధికార, ప్రతిపక్షాల పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి అవినీతి ఒకరు బయటపెట్టుకుంటున్న సందర్భాలు చోటుచేసుకున్నాయి. మొన్నటికి మొన్న తాజాగా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసుకున్నారు. అనపర్తి తాజా మాజీ ఎమ్మెల్యేలు బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో  సత్య ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై చెలరేగిన అవినీతి ఆరోపణల వివాదం కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య అవినీతి ఆరోపణల రచ్చ మొదలైంది. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ సవాళ్లు విసురుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధాన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు తాజా వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.. బీసీ జనార్ధన్ రెడ్డి 22 కేసులలో నిందితుడని.. భూ కబ్జాదారుడని.. కేసులను ఎఫ్ఐఆర్ లో చూపిస్తానని ఎమ్మెల్యే కాటసాని సవాల్ చేశారు. బనగానపల్లెలో నివాసం ఉంటున్న ఆయన ఇల్లు కూడా కబ్జా అని ఆరోపించారు. దీనిపై చర్చకు సిద్ధమేనంటూ ఎమ్మెల్యే ప్రకటించారు.

ఇక ఎమ్మెల్యే కాటసాని ఆరోపణలపై బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా ఎమ్మెల్యే కాటసాని మార్చి అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. ప్రతీ రియల్ వెంచర్ నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నాడని.. ఎమ్మెల్యే చేస్తున్న అక్రమ మైనింగ్ వల్ల అతి ప్రాచీన ఆలయాలకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. అక్రమాలు ఎత్తిచూపితే కేసులు పెట్టి బెదిరిస్తున్నాడని ఆరోపించాడు.

తాను కూడా ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు బయటపెట్టడానికి రెడీ అని డిబేట్ కు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు. ఇలా తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలతో రచ్చ కెక్కడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News