కాన్ఫిడెంట్‌ గా జగన్.. కారణం విజయం పై నమ్మకమేనా?

Update: 2019-01-07 04:38 GMT







3600 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ పాదయాత్రను మరో మూడు రోజుల్లో ముగించబోతున్న వైసీపీ అధినేత జగన్మోహన రెడ్డి పలు మీడియా చానళ్లతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే సాక్షి టీవీతో మాట్లాడిన ఆయన తాజాగా టీవీ9కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సుదీర్ఘ పాదయాత్ర వల్ల కలిగిన శారీరక శ్రమ కారణంగా కావొచ్చేమో కాస్త అలసటగానే కనిపించిన జగన్ మాటల్లో మాత్రం ఎక్కడా అలసట, తడబాటు వంటివి కనిపించనివ్వలేదు. ప్రతి ప్రశ్నకు స్పష్టమైన స్టాండ్‌ తో సమాధానాలిచ్చారు. ఎక్కడా దాటవేత ధోరణి అనేదే లేకుండా సాగారు.
   
బీజేపీతో మైత్రికి సంబంధించిన విమర్శల విషయంలో కానీ, టీ ఆర్ ఎస్‌ తో సంబంధాల విషయంలో కానీ ఆయన తన మనసులో ఉన్నది చెప్పడానికి ఏమీ సందేహించలేదు. కేసీఆర్‌ కు తానే ఫోన్ చేసి అభినందించానని.. ఇద్దరం కలిసి ప్రత్యేక హోదా కోసం పనిచేస్తే తప్పేంటని ప్రశ్నించారు.
   
అలాగే.. పార్టీలో అంతా తానే అన్నట్లు ఉంటానని.. ఎవరి మాటా విననని అంటారన్న విమర్శలపైనా ఆయన స్పందించారు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తి కేంద్రంగా.. ఒక నాయకుడి కేంద్రంగా సాగుతాయని.. ఎక్కడైనా అంతేనని.. తమ పార్టీలోనూ అంతేనని.. అయితే... తాను అందరితో చర్చించే నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. తన విమర్శకులు తనను మొండోడు అంటే అనొచ్చేమీ కానీ, తన పార్టీ వారు అలా అనరని.. అనుకున్న మాటపై గట్టిగా నిలబడతాడని మాత్రమే అంటారంటూ చాలా తెలివిగా సమాధానం చెప్పారు.
   
అంతేకాదు.. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ  తొలుత తమతో పొత్తుకు సంప్రదించిందని.. దానిపై తాను పార్టీలో అందరి నిర్ణయం తీసుకున్నానని, వారంతా వద్దని చెప్పడంతో తాను బీజేపీతో కలవలేదని చెప్పారు. మరోవైపు ఇంటర్వ్యూకి వచ్చేవారిని ముప్పతిప్పలు పెట్టడంలో నేర్పరిగా పేరున్న ఆ యాంకర్ జగన్‌ ను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. జగన్ చాలా పరిణతి ప్రదర్శించడంతో యాంకర్ సాధారణ ప్రశ్నలతోనే సరిపెట్టాల్సి వచ్చింది. ఒకట్రెండు మంచి ప్రశ్నలు అడిగినప్పటికీ జగన్ వాటికి తొణక్కుండా సమాధానం ఇవ్వగలిగారు. రాజకీయంగా తమ ఉద్దేశాలు, లక్ష్యాలు, విధానాలు అన్నీ చాలా స్పష్టంగా చెప్పారు జగన్. అంతేకాదు.. సుదీర్ఘంగా సాగిన ఇంటర్వ్యూలో జగన్ మిస్టర్ కూల్‌ లా కనిపించారు.



Full View
Tags:    

Similar News