బందరులో ఈసారి పేర్ని నానికి టికెట్ లేనట్టేనా?

Update: 2022-06-13 08:39 GMT
కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. రెండు రోజుల కిందట బందరు ఎంపీ వల్లభనేని బౌలశౌరిని మాజీ మంత్రి, బందరు ఎమ్మల్యే పేర్ని నాని అనుచరులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వల్లభనేని బాలశౌరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఎమ్మెల్యే పేర్ని నాని పేరు ఎత్తి మరి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో బందరు అసెంబ్లీకి తానే పోటీ చేయాలనే యోచనలో బాలశౌరి ఉన్నారని తెలుస్తోంది.

అటు పేర్ని నాని, ఇటు బాలశౌరి ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందినవారే. ఇద్దరూ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులే. అయితే బాలశౌరితో రాజకీయాల్లోకి రాకముందు నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రతి సందర్భంలోనూ బాలశౌరి ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించేవారు.

మరోవైపు పేర్ని నాని పార్టీలో చేరాక మాత్రమే వైఎస్ జగన్ కు దగ్గరయ్యారు. పార్టీ తరఫున, సీఎం జగన్ తరఫున ప్రత్యర్థులపైన, ప్రత్యర్థి పార్టీలపైన నిప్పులు చెరగడంలో పేర్ని నాని శైలే వేరు. వైఎస్ జగన్ మొదటి మంత్రివర్గంలో పేర్ని నాని రవాణా, సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రెండోసారి మంత్రివర్గ విస్తరణలో పేర్ని నానికి మరోసారి మంత్రి పదవి ఖాయమనుకున్నప్పటికీ దక్కలేదు.

ఆయనను కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా జగన్ నియమించారు. ఇక వల్లభనేని బాలశౌరి 2004లో తెనాలి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2009లో ఆ నియోజకవర్గం రద్దవడంతో నరసరావుపేట నుంచి పోటీ చేసి అతి తక్కువ మెజారిటీ (1607) ఓట్లతో ఓడిపోయారు.

అలాగే 2014లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో బందరు ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణపై బాలశౌరి గెలుపొందారు. ఇలా 2004 నుంచి 2019 వరకు నాలుగు నియోజకవర్గాల నుంచి ఎంపీగా పోటీ చేశారు.

ఇక పేర్ని నాని 2009లో బందరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో ఓటమి చవిచూశారు. మళ్లీ 2019లో గెలుపొందారు. ఇప్పుడు వల్లభనేని బాలశౌరితో గొడవ నేపథ్యంలో పేర్ని నానికి వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదని చర్చ నడుస్తోంది. ఆయనను పెడన నుంచి పోటీ చేయిస్తారని అంటున్నారు. బందరు ఎమ్మెల్యేగా బాలశౌరి పోటీ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ అప్పుడు సీటు ఖాళీ చేయాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News