'కియా'పై వైఎస్సార్సీపీ ఎంపీ వివాదాస్పద కామెంట్లు!

Update: 2019-08-09 10:09 GMT
కియాలో స్థానిక యువతకు అవకాశాలు కల్పించడం మాట అటుంచి, కనీసం ఆ కంపెనీని చూడటానికి కూడ అవకాశం ఇవ్వడం లేదని అంటున్నారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఇటీవలే పోలిస్ జాబ్ ను వదులుకుని ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఘన విజయం సాధించిన మాధవ్ ఇంకా పోలిస్ మూడ్ నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపించడం లేదు. కియా కొత్త కారు ఆవిష్కరణకు హాజరైన మాధవ్ అక్కడ ఒకింత వివాదస్పద కామెంట్లు చేశారు. కియా ప్రతినిధులను హడలు కొట్టేట్టుగా ఈయన కామెంట్లు చేయడం గమనార్హం.

'కియా కారు అయితే బయటకు వచ్చింది కానీ, ఇక్కడ శక్తిమంతమైన యువతకు మాత్రం అవకాశాలు రాలేదు..' అంటూ కియా కొత్త కారు మీద సంతకం చేశారట మాధవ్. కొత్త మోడల్ కారుపై అక్కడకు వచ్చిన అతిథులు సంతకాలు చేసే కార్యక్రమంలో గోరంట్ల మాధవ్ ఈ కామెంట్ ను రాసినట్టుగా ప్రకటించుకున్నారు. మామూలుగా డిమాండ్ చేయడం వేరు, అలా రాసేయడం వేరు.

ఇలాంటి తీరు పరిశ్రమ వర్గాల్లో ఆందోళన రేపుతుంది. 'కియా' కర్మాగారాన్ని ఆనుకుని.. ఇంకా మరి కొన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయనే అభిప్రాయాలున్నాయి. అక్కడ నీటి వనరులు, భూమి అందుబాటులో ఉన్న నేపథ్యంలో మరిన్ని కంపెనీలు రావొచ్చనే అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో.. ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఈ తరహా కామెంట్లు చేయడం, స్థానికులకు  75 శాతం అవకాశాలు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడతామని ప్రకటించడం విశేషం. ఈ ఎంపీ మాటలను అవకాశంగా తీసుకుని తెలుగుదేశం అనుకూల మీడియా, అనుకూల సోషల్ మీడియా వర్గాలు .. ఇలాంటి మాటలు పారిశ్రామిక ప్రగతికి విఘాతం అంటూ హడావుడి చేస్తూ ఉండటం గమనార్హం.
Tags:    

Similar News