వైవీ స‌వాల్‌!... చంద్ర‌బాబుకు ద‌మ్ముందా?

Update: 2018-03-24 10:54 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం సాగుతున్న పోరులో విప‌క్ష వైసీపీ ఆది నుంచి కూడా త‌న స్టాండ్ ను ఎన్న‌డూ మ‌రువ‌లేద‌నే చెప్పాలి. విప‌క్ష నేత హోదాలో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఏ మేర లాభం చేకూరుతుంద‌న్న విష‌యంపై ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పించే నిమిత్తం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి యువ‌భేరీల పేరిట ప‌లు జిల్లాల్లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా ప్ర‌త్యేక హోదా కోసం అవ‌స‌ర‌మైతే త‌మ ఎంపీల‌తో రాజీనామాలు చేయిస్తామ‌ని కూడా జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి కూడా మ‌న‌కు తెలిసిందే. తాజాగా మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీకి కేటాయింపులేమీ చేయ‌కుండానే త‌నదైన వ్యూహాన్ని అమ‌లు చేసిన మోదీ స‌ర్కారు కార‌ణంగా టీడీపీ కూడా అనివార్యంగా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలోకి దిగ‌క త‌ప్ప‌లేదు. అంతేకాకుండా త‌మ ఎంపీల‌తో ఏప్రిల్ 6న రాజీనామా చేయిస్తామ‌ని, మోదీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో మ‌రింత బేజారైన చంద్ర‌బాబు... ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌లేదు.

అప్ప‌టికే మోదీ స‌ర్కారుపై వైసీపీ ప్ర‌వేశ‌పెడ‌తామ‌న్న అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన బాబు... మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకుని వైసీపీ అవిశ్వాసానికి స‌మాంత‌రంగా టీడీపీ త‌ర‌ఫున మ‌రో అవిశ్వాస తీర్మానం ఇప్పించారు. ఈ రెండు అవిశ్వాస తీర్మానాల‌ను అడ్దుకునే వ్యూహంలో ఇప్ప‌టిదాకా మోదీ స‌ర్కారు ప‌ఫ‌ల‌మైంద‌నే చెప్పాలి. అయితే వ‌చ్చే వారంలో హోదా పోరును మ‌రింత‌గా ఉధృతం చేసేందుకు ప‌క్కా వ్యూహం ర‌చించిన వైసీపీ... తాజాగా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌టన చేసింది. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి... చంద్ర‌బాబుకు పెద్ద స‌వాలే విసిరారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాజీలేద‌ని, ఇంత‌కుముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగానే ఏప్రిల్ 6 లోగా మోదీ స‌ర్కారు దిగిరాక‌పోతే... తామంతా రాజీనామాల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ఆయ‌న టీడీపీకి భారీ స‌వాలే విసిరారు. ప్ర‌త్యేక హోదా కోసం తాము రాజీనామాలు చేస్తున్నామ‌ని, ప్ర‌త్యేక హోదాపై టీడీపీకి కూడా చిత్త‌శుద్ధి ఉంటే ఆ పార్టీ ఎంపీలు కూడా రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 6న తాము రాజీనామాలు చేస్తున్నామ‌ని, మ‌రి మీ పార్టీ ఎంపీల సంగ‌తి ఏమిట‌ని ఆయ‌న చంద్ర‌బాబును సూటిగానే ప్ర‌శ్నించారు. *మేం రాజీనామాల‌కు సిద్ధం. మ‌రి మీరు కూడా రాజీనామాలు చేసే ద‌మ్ముందా?* అని వైవీ సుబ్బారెడ్డి టీడీపీకి పెద్ద స‌వాలే విసిరారు. వెర‌సి ఏప్రిల్ 6న త‌మ‌తో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసే ప‌రిస్థితి క‌ల్పించార‌నే చెప్పాలి. ఇప్ప‌టికే వైసీపీ పోరుతో అనివార్యంగానే హోదా పోరును భుజానికెత్తుకున్న‌ట్లుగా క‌నిపిస్తున్న చంద్ర‌బాబు... మ‌రి 6న త‌మ పార్టీ ఎంపీల‌తో రాజీనామాలు చేయిస్తారా? అన్న కోణంలో కొత్త చ‌ర్చ మొద‌లైంద‌నే చెప్పాలి. అస‌లు వైవీ సుబ్బారెడ్డి స‌వాల్‌కు చంద్రబాబుకు స్పందించే ద‌మ్ముందా? అన్న కోణంలోనూ చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఎందుకంటే ఇప్ప‌టికే చంద్ర‌బాబు అవినీతిపై బీజేపీ త‌న‌దైన శైలిలో ఎదురు దాడి మొద‌లెట్టింది. అస‌లు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డానికి త‌మ‌కేమీ ఇబ్బంది లేద‌ని, అయితే హోదా కింద అందే నిధుల‌ను చంద్ర‌బాబు స‌ర్కారు అవినీతి లేకుండా ఖ‌ర్చు చేస్తుందా? అన్న అనుమానాలు ఉన్నాయ‌ని,

ఈ క్ర‌మంలోనే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేద‌ని కూడా నేటి ఉద‌యం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా హోదాకు అడ్డు చంద్ర‌బాబు అవినీతేన‌ని ఆయ‌న సూటిగానే చెప్పేశారు. మ‌రోవైపు ఒక్క‌టొక్క‌టిదా త‌న అవినీతిపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు సెల్ఫ్ డిఫెన్స్ లో ప‌డ్డార‌ని, ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌న ఎంపీలను కేంద్ర మంత్రుల వ‌ద్ద‌కు పంపుతున్నార‌ని కూడా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇదే త‌ర‌హా వాద‌న‌ను వినిపించిన వైవీ సుబ్బారెడ్డి... చంద్రబాబు త‌న అవినీతిపై కేసులు న‌మోదు కాకుండా కేంద్రంతో లాలూచీ రాజ‌కీయాలు న‌డుపుతున్నార‌ని, ఈ క్ర‌మంలో ఎంపీల‌తో రాజీనామాలు చేయించే ద‌మ్ము చంద్రబాబుకు ఉందా? అని కూడా ప్ర‌శ్నించారు. మొత్తంగా వైవీ సుబ్బారెడ్డి తాజా స‌వాల్ చంద్ర‌బాబును పెనంలో నుంచి పొయ్యిలోకి నెట్టేసిన‌ట్టుగా ఉందన్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News