చంద్ర‌బాబు ద‌ళిత వ్య‌తిరేకి: వైవీ సుబ్బారెడ్డి

Update: 2017-07-22 11:25 GMT
సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ద‌ళిత వ్య‌తిరేకి అని, ఏపీలో పోలీసులు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. చంద్ర‌బాబు మూడేళ్ల పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దళితుల భూములు ఆక్ర‌మించ‌డం, వారిపై దాడులు వంటి ఘ‌ట‌న‌లు పెరిగిపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌కాశం జిల్లా దేవ‌ర‌ప‌ల్లిలో ఇటీవల దళితులపై జ‌రుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

నేష‌న‌ల్ క్రైం బ్యూరో లెక్క‌ల ప్ర‌కారం 2015లో  ఏపీలో 300 మంది మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రిగాయ‌ని, వారిలో 100 మంది మ‌హిళ‌లు ద‌ళితులేన‌ని తెలిపారు. గోదావ‌రి మెగా ఆక్వా పార్క్ కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న వారిలో అధిక శాతం మంది ద‌ళితులు - బీసీలేన‌ని చెప్పారు. తుందుర్రులో దళిత, బీసీ మహిళల అరెస్టు చేయ‌డం సిగ్గుచేట‌న్నారు. క‌నీసం మ‌హిళ‌ల‌ని చూడ‌కుండా పోలీసులు వారిని అమానుషంగా అరెస్టు చేశార‌న్నారు. ఆక్వా పార్క్ వ‌ల్ల త‌మ గ్రామాలు క‌లుషితమ‌వుతాయ‌న్నవారి ఆవేద‌న‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.

ప్రకాశం జిల్లా దేవరపల్లిలో ప‌రిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయ‌ని మండిపడ్డారు. గ్రామంలో ఇప్పటికే ఒక చెరువు ఉన్నప్పటికీ, కేవ‌లం దళితుల భూములు లాక్కోవాల‌నే ఉద్దేశంతోనే అర్థరాత్రి చెరువు త‌వ్వుతున్నార‌ని ఆరోపించారు. గ్రామంలోని 200 దళిత కుటుంబాలకు 400మంది పోలీసులను ప‌హారా పెట్టి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నార‌న్నారు. దేవ‌ర‌ప‌ల్లిలోని ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితిని  కేంద్ర హోంమంత్రి - జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాన‌ని తెలిపారు.

కేవ‌లం వైసీపీ నేత‌లు దళితుల ప‌క్షాన నిల‌బ‌డ్డార‌నే కార‌ణంతో టీడీపీ ప్ర‌భుత్వం దారుణంగా వ్యవహరిస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ‌ను ఎన్ని ర‌కాలుగా బెదిరించినా దళితులకు, బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. దేవరపల్లి ఘటనపై న్యాయస్థానాన్ని - హెచ్‌ ఆర్‌ సీని ఆశ్రయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పాదయాత్రకు అనుమతులు తీసుకోవాల్సిన‌ అవసరమేమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్ర‌తిపక్షంలో ఉన్నప్పుడు ఎవరిని అడిగి పాదయాత్ర చేశారని నిలదీశారు. నంద్యాలలో గెలుపుకోసం చంద్ర‌బాబు  దిగజారుడు రాజకీయాలకు పాల్ప‌డుతున్నార‌న్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామ‌న్నారు.

Tags:    

Similar News