శ్రీ‌నివాస్ జ‌గ‌న్ అభిమాని కాదు..టీడీపీ కార్య‌క‌ర్త!

Update: 2018-10-26 08:24 GMT
ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన దాడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ పార్టీ ఎంపీ అయిన ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి తీరును తీవ్రంగా తప్పు ప‌ట్టారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న జ‌గ‌న్ ను పరామ‌ర్శించేందుకు వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

వైఎస్ జ‌గ‌న్ పై దాడికి పాల్ప‌డిన జాన‌ప‌ల్లి శ్రీ‌నివాస‌రావు  ఎంత‌మాత్రం జ‌గ‌న్ అభిమాని కాద‌ని.. అత‌డు టీడీపీ కార్య‌క‌ర్త అని పేర్కొన్నారు. జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి ఉదంతంలో చంద్ర‌బాబు స్పందించిన తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. బాబు తీరును ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నార‌న్నారు.

బాబు తీరు చూస్తే.. ఆయ‌న‌కు మాన‌వ‌త్వం ఉందా? అన్న సందేహం క‌లుగుతుంద‌న్న ఆయ‌న‌.. గ‌తంలో బాబుపై మావోలు జ‌రిపిన దాడిని గుర్తు చేసుకున్నారు. తిరుప‌తి అలిపిరి ద‌గ్గ‌ర బాబుపై దాడి జ‌రిగితే.. నాడు విప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ హుటాహుటిన తిరుప‌తికి వెళ్లి ప‌రామ‌ర్శించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.

నాడు చంద్ర‌బాబుపై దాడి జ‌రిగితే వైఎస్ తీవ్రంగా ఖండించార‌ని.. ఇందుకు భిన్నంగా తాజాగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించార‌న్నారు. బాబుపై జ‌రిగిన దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ అప్ప‌ట్లో గాంధీ బొమ్మ వ‌ద్ద న‌ల్ల‌బ్యాడ్జీల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు.

జ‌గ‌న్ పై దాడి చేసిన నిందితుడు శ్రీ‌నివాస్ జ‌గ‌న్ అభిమాని అంటూ త‌ప్పుడు ప్ర‌చారం సాగుతుంద‌ని.. అత‌డు టీడీపీ కార్య‌క‌ర్త అని చెప్పారు. నిందితుడు సోద‌రుడు ఒక‌రు మీడియాతో మాట్లాడుతూ గ‌తంలో తాను.. శ్రీ‌నివాస్ జ‌గ‌న్ అభిమానులుగా ఉండేవారిమ‌ని.. ఆర్నెల్ల నుంచి టీడీపీ కార్య‌క‌ర్త‌లుగా మారిన‌ట్లు చెప్పారు.

జ‌గ‌న్ తో శ్రీ‌నివాస‌రావు న్యూ ఇయ‌ర్ శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లుగా ఉన్న ఫ్లెక్సీ ఫోటో కూడా టీడీపీ నేత‌లు సృష్టించిన‌వ‌నేన‌ని చెప్పారు. జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగ‌మ‌ని.. దానికి క‌థ‌.. క‌థ‌నం మొత్తం సీఎం చంద్ర‌బాబేన‌ని చెప్పారు.

నిందితుడు శ్రీ‌నివాస్ కుటుంబం ఇల్లు క‌ట్టించుకునేందుకు ఇటీవ‌ల రెండు లోన్లు మంజూర‌య్యాయ‌ని.. వాటికి టీడీపీ నేత‌లే ఇప్పించిన‌ట్లుగా వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. శ్రీ‌నివాస్ కు టీడీపీ నేత‌లు ఆశ చూపించి జ‌గ‌న్ మీద దాడికి పురిగొల్పార‌న్నారు. మెడ మీద టార్గెట్ పెట్టాడ‌ని.. జ‌గ‌న్ ప‌క్క‌కు వంగ‌టంతో అది భుజానికి గుచ్చుకుంద‌న్నారు.
Tags:    

Similar News