దేశ చరిత్రలో తొలిసారి 38 మందికి మరణ శిక్ష

Update: 2022-02-18 07:30 GMT
దేశ చరిత్రలోనే ఇది తొలిసారి.. ఒకే కేసులో ఇంతమంది నిందితులకు మరణశిక్ష విధించడం భారతదేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38మంది నిందితులకు ఉరిశిక్ష పడింది.

2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38మందికి మరణ శిక్ష విధిస్తూ ఇవాళ గుజరాత్ లోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ), ఐపీసీ 302 సెక్షన్ల ప్రకారం మరణ శిక్షను ఖరారు చేశారు. అయితే ఒకే కేసులో ఇంతమంది నిందితులకు మరణ శిక్ష విధించడం భారతదేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇదే కేసులో దోషులుగా తేలిన మరో 11 మందికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువడింది. వీరికి పెరోల్ కూడా అవకాశం లేకుండా తీర్పునిచ్చింది. ప్రత్యేక న్యాయమూర్తి ఏఆర్ పటేల్ తీర్పు వెలువరిస్తూ బాంబు పేలుళ్ల కేసులో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం మంజూరు చేశారు. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25వేలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.

-కేసు ఇదీ..

2008 జూలై 26న అహ్మదాబాద్లో 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇందులో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200మందికిపైగా గాయపడ్డారు. మరికొన్ని బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిదిన్ తోపాటు హర్ఖత్ ఉల్ జిహాదీ అల్ ఇస్లామీ ఉగ్రవాద సంస్థలే కారణమని తేల్చారు.

2002లో గోద్రాలో రైలు బోగీలకు నిప్పంటించిన ఘటనకు ప్రతీకారంగానే 2008లో ఉగ్రవాదులు ఈ దాడులు చేశారు. ఈ కేసుకు సంబంధించి అహ్మదాబాద్, సూరత్ లలో ఎఫ్ఐఆర్ లునమోదయ్యాయి. వీటిపై కోర్టు విచారణ జరిపింది. మొత్తం 78మందిని నిందితులుగా నిర్ధారించింది. అనంతరం వారిలో ఒకరు అప్రూవర్ గా మారడంతో నిందితుల సంఖ్య 77కు తగ్గింది.

ఈ 77మందిలో 49మందిని కోర్టు ఫిబ్రవరి 8న దోషులుగా తేల్చింది.  సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 28 మంది నిర్ధోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. పేలుళ్లకు సంబంధించిన కేసులో 49 మందిని దోషులుగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు ఈనెల 8న తుది తీర్పును వెలువరించింది. సాక్ష్యాలు లేకపోవడంతో మరో 28మందిని నిర్ధోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.

    

Tags:    

Similar News