కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ... ఉత్కంఠ పోరులో కోల్ కతాను వరించిన విజయం!

భారీ స్కోర్లకు నెలవైన ఈడెన్ గార్డెన్ లో పరుగుల వరద పారింది.

Update: 2024-04-21 17:19 GMT

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మరో సండే సందడి మొదలైంది. ఇందులో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లకు నెలవైన ఈడెన్ గార్డెన్ లో పరుగుల వరద పారింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన బెంగళూరు.. కోల్ కతాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నాటి నుంచి ఈ మ్యాచ్ ఆద్యాంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం!

బెంగళూరు ఆహ్వానం మేరకు టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కోల్ కతా బ్యాటర్స్ లు కాస్త దూకుడుగానే మొదలుపెట్టారు. సిరాజ్ వేసిన మొదటి ఓవర్ లో ఫిలిప్ సాల్ట్.. సిక్స్‌, ఫోర్ కొట్టాడు. అనంతరం యశ్‌ బౌలింగ్‌ లో రెండు ఫోర్లు బాదాడు. ఇక నాలుగో ఓవర్ లో సాల్ట్ బీభత్సం సృష్టించేశాడు. ఫెర్గూసన్‌ వేసిన ఓవర్ లో 6, 4, 4, 6, 4, 4 అంటూ ఎండాకాలం పట్టపగలే చుక్కలు చూపించేశాడు.

ఈ స్థాయి దూకుడు కొనసాగిస్తున్న సాల్ట్ ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. అతడు వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి ఫిలిప్ సాల్ట్‌ (48: 14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఔటయ్యాడు. యశ్ వేసిన నెక్స్ట్ ఓవర్ లో నరైన (10) ఔటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి రఘువంశి (3) కూడా ఔటయ్యాడు. ఇలా ఒకే ఓవర్ లో కోల్ కతాకు రెడు షాక్ లు తగిలాయి. దీంతో... పవర్ ప్లే ముగిసే సరికి కోల్ కతా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులకు చేరింది.

ఇదే క్రమంలో 9వ ఓవర్ లో దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్ (16) కూడా ఔటయ్యాడు. ఈ సమయంలో కోల్ కతా స్కోరు 100 దాటింది. 9 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్లు కోల్పోయిన కోల్ కతా 102 పరుగులు చేసింది. ఈ క్రమంలో... ఫెర్గూసన్ వేసిన 14 ఓవర్ తొలిబంతికి రింకు సింగ్‌ (24) ఔటయ్యాడు. ఈ క్రమంలో కోల్‌ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

యశ్ దయాల్ వేసిన 17వ ఓవర్‌ లో 23 పరుగులు రావడంతో కోల్‌ కతా స్కోరు 5 వికెట్ల నష్టానికి 177 పరుగులకు చేరింది. అదే నెక్స్ట్ ఓవర్ రెండో బంతికే కెప్టెన్ శ్రేయస్‌ (50) ఔటయ్యాడు. దీంతో... దీంతో 179 పరుగుల వద్ద కోల్‌ కతా ఆరో వికెట్‌ ను కోల్పోయినట్లయ్యింది. ఇలా సాగిన కోల్ కతా బ్యాటింగ్ ఫలితంగా... నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది ఆ జట్టు.

కోల్ కతా బ్యాటర్స్ లో శ్రేయస్‌ (50), ఫిలిప్ సాల్ట్ (48), ఆండ్రూ రస్సెల్ (27*), రమణ్‌ దీప్ (24*), రింకు సింగ్ (24) రాణించారు. ఇక బెంగళూరు బౌలర్స్ లో యశ్ దయాల్, కేమరాన్ గ్రీన్ లు తలో రెండు వికెట్లు తీసుకోగా... సిరాజ్, ఫెర్గూసన్ లు చెరో వికెట్ దక్కించుకున్నారు.

బ్యాటింగ్‌ కు దిగిన బెంగళూరు.. విజయలక్ష్యం 223:

బెంగళూరు లక్ష్య చేధనకు దిగింది. ఈ సందర్భంగా... కొహ్లీ, డూప్లెసిస్ లు క్రీజ్ లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో హర్షిత్‌ రాణా వేసిన తొలి ఓవర్లో కొహ్లీ ఒక ఫోర్, ఒక సిక్ కొట్టడంతో 12 పరుగులు వచ్చాయి. ఇదే క్రమంలో రెండో ఓవర్ లో కొహ్లీ ఒక సిక్స్ బాదగా.. డూప్లెసిస్ ఒక ఫోర్ సాధించాడు. దీంతో 2 ఓవర్లకు బెంగళూరు స్కోర్‌ 27కి చేరింది. ఆల్ ఈస్ వెల్ గా కనిపిస్తున్న ఈ దశలో.. హర్షిత్‌ వేసిన మూడో ఓవర్‌ లో కోహ్లీ(18) ఔటయ్యాడు.

అనంతరం వరుణ్‌ చక్రవర్తి వేసిన నాలుగో ఓవర్లో బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్‌ (7) కూడా ఔటయ్యాడు. దీంతో 4 ఓవర్లకు రెండు కీలక వికెట్లు కోల్పోయిన బెంగళూరు 45 పరుగులు సాధించింది. ఈ క్రమంలోనే వరుణ్‌ చక్రవర్తి వేసిన 9వ ఓవర్లో జాక్స్‌ (53) 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో 9 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.

ఈ కీలక సమయంలో... రసెల్‌ వేసిన 12వ ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. ఇందులో భాగంగా... తొలి బంతికి జాక్స్‌ (55), నాలుగో బంతికి రజిత్ (52) ఔటయ్యారు. దీంతో బెంగళూరు కష్టాలు మొదటికి వచ్చినట్లుగా మారింది పరిస్థితి. దీంతో 12 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్లు కోల్పోయిన బెంగళూరు 145 పరుగులు సాధించింది.

అనంతరం నరైన్‌ వేసిన 13వ ఓవర్లో గ్రీన్‌ (6), లామ్రార్‌ (4) ఔటయ్యారు. దీంతో బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో పడిపోయిందనే చెప్పుకోవాలి. ఇక ఈ పరిస్థితుల్లో దినేష్ కార్తీక్ ఒక్కడే బెంగళూరు హోప్స్ అనే కామెంట్స్ మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో 13 ఓవర్లకు బెంగళూరు స్కోరు 6 వికెట్ల నష్టానికి 155 పరుగులకు చేరింది. 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 181 పరుగులు చేసింది.

ఈ సమయలో వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్ లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో బెంగళూరు విజయానికి 18 బంతుల్లో 37 పరుగులు అవసరం పడింది. అనంతరం హర్షిత్ రానా వేసిన 18 ఓవర్ రెండో బంతికి ప్రభుదేశాయ్ ఔటయ్యాడు. దీంతో... 188 పరుగుల వద్ద ఏడో వికెట్ పడినట్లయ్యింది. ఈ ఓవర్ లో కేవలం ఆరు పరుగులే రావడంతో చివరి రెండు ఓవర్లో బెంగళూరు విజయానికి 31 పరుగులు కావాల్సి ఉంది.

ఈ క్రమంలో ఆండ్రూ రస్సెల్ వేసిన 19 వ ఓవర్లో సింగిల్స్ ని లైట్ తీసుకున్న కార్టీక్ ఒక సిక్స్, ఒక ఫోర్ సాధించగా... చివరి బంతిలో ఔటయ్యాడు. దీంతో 202 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన బెంగళూరుకు చివరి ఆరు బంతుల్లోనూ 21 పరుగుల అవసరం ఏర్పడింది. ఈ సమయంలో 20 ఓవర్ మొదటి బంతికి కరన్ శర్మ సిక్స్ కొట్టగా.. బెంగళూరు ఫ్యాన్స్ లో హుషారు నెలకొంది.

అయితే ఆ తర్వాత బంతికి అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో చివరి నాలుగు బంతుల్లో 15 పరుగులు కావాలి. ఈ సమయంలో 3వ బంతికి మరో సిక్స్ కొట్టడంతో... చివరి 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. నెక్స్ట్ బంతికీ మరో సిక్స్ వచ్చింది. ఆ తర్వాత బంతికే కరన్.. స్టార్క్ కే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఈ సమయంలో చివరి బంతికి 2 పరుగులకు డ్రా.. 3 పరుగులకు విజయం అనే స్థితిలో... చివరి బంతికి ఒక్క పరుగుమాత్రమే రావడంతో... ఉత్కంట మ్యాచ్ లో విజయం కోల్ కతాను వరించింది.

Tags:    

Similar News