ఉప్పల్ లో సన్ రైజర్స్- ముంబై మ్యాచ్.. మీ టికెట్ వెయిటింగ్ నంబర్ లక్ష
ఇప్పుడు ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ కోసం కూడా ఇలానే వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది.;

సాధారణంగా దూరప్రాంతాలకు వెళ్లే.. రద్దీ ఎక్కువగా ఉండే ట్రయిన్ టికెట్ లకు వెయిటింగ్ లిస్ట్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. మనకు సీటు దక్కుతుందో లేదో...? కనీసం నిలుచుని అయినా ప్రయాణించే వీలుంటుందా?? పండుగకు పబ్బానికి సొంత ఊరికి వెళ్లగలమా? అని ఆందోళన చెందుతుంటారు..
ఇప్పుడు ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ కోసం కూడా ఇలానే వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ తో ఈ నెల 17న గురువారం సన్ రైజర్స్ ఆడబోయే మ్యాచ్ కు వెయిటింగ్ లిస్ట్ లక్ష దాటింది కాబట్టి.
ఈ సీజన్ లో కిందామీద పడుతున్నాయి సన్ రైజర్స్-ముంబై ఇండియన్స్. గత వారం ముంబై కనాకష్టంగా లక్నోపై, సన్ రైజర్స్ కొద్దిగా కష్టంగా పంజాబ్ పై నెగ్గాయి. ఆరు చొప్పున మ్యాచ్ లు ఆడిన ఈ రెండు జట్లూ రెండు మ్యాచ్ లలోనే నెగ్గాయి.
దీంతోపాటు ఈ సీజన్ లో తొలిసారిగా ముంబై ఇండియన్స్ తో ఆడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ లో పెద్ద జట్లుగా ముద్రపడిన ముంబై, హైదరాబాద్ టైటిల్ రేసులో నిలవాలంటే వచ్చే మ్యాచ్ లు అన్నిట్లోనూ కచ్చితంగా గెలవాలి. అందుకనే ఆ రెండు జట్లు తలపడే గురువారం నాటి మ్యాచ్ టికెట్ల కు బాగా డిమాండ్ నెలకొంది.
246 పరుగులు టార్గెట్ అయినప్పటికీ గత వారం సన్ రైజర్స్ తనదైన శైలిలో దూకుడుగా ఆడి పంజాబ్ కింగ్స్ ను మట్టికరిపించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (141) అద్భుత సెంచరీ అభిమానులను అలరించింది.
ఇక ముంబై ఇండియన్స్ కూడా లక్నోతో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో అద్భుత విజయం సాధించింది. అందుకనే రెండు జట్ల మధ్య గురువారం నాటి మ్యాచ్ కు బాగా క్రేజ్ ఏర్పడింది.
కొసమెరుపు: నిరుడు సన్ రైజర్స్ మొదటి టాప్ స్కోర్ 277 పరుగుల టాప్ స్కోర్ ను నమోదు చేసింది ముంబై ఇండియన్స్ పైనే కావడం గమనార్హం.