సన్ రైజర్స్ లో మరో హిట్టర్..ఎవరీ అనికేత్ వర్మ? ఎక్కడ పట్టుకొచ్చారు?
అనికేత్ వర్మ.. సన్ రైజర్స్ నయా సంచలనం. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఐదు సిక్సర్లతో వెలుగులోకి వచ్చాడు ఈ సన్ రైజర్స్ బ్యాట్స్ మన్.;

సన్ రైజర్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో 300 కొట్టగలిగే జట్టు ఏదైనా ఉందీ అంటే అది సన్ రైజర్స్ అని చెప్పేంత పేరు తెచ్చుకుంది. నిరుడు 250 పరుగులు అలవోకగా బాదేసింది.. ఈసారి తొలి మ్యాచ్ లోనే 286 పరుగులు చేసింది. ఇప్పుడు కాస్త వెనుకబడ్డా.. మళ్లీ పుంజుకుంటుంది అని ఆశలు పెట్టుకోవచ్చు. దీనికి కారణం.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రూపంలో భారీ హిట్టింగ్ చేసే ఓపెనర్లు.. నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ ఆల్ రౌండర్. మరి వీరికి అగ్నికి వాయువు తోడైనట్లు మరొకరు తోడయ్యారు. అతడి ఆట చూస్తుంటే సన్ రైజర్స్ ఈ సారి 300 కొట్టడం ఖాయం అనిపిస్తోంది.
అనికేత్ వర్మ.. సన్ రైజర్స్ నయా సంచలనం. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఐదు సిక్సర్లతో వెలుగులోకి వచ్చాడు ఈ సన్ రైజర్స్ బ్యాట్స్ మన్. 13 బంతుల్లోనే 36 పరుగులు చేసిన అనికేత్ గురించి చర్చ మొదలైంది. ఇంతకూ ఎవరు ఇతడు అని వెదకసాగారు.
తీరా చూస్తే ఇతడికి గొప్ప కెరీర్ ఏమీలేదు. అనికేత్ ఆడింది కేవలం నాలుగు టి20లే. ఇందులో మూడు ఈ ఐపీఎల్ వే. దీనికిముందు అతడి ఒకే ఒక దేశవాళీ మ్యాచ్ డిసెంబరులో ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్ తరఫున హైదరాబాద్ పై ఆడాడు. కానీ, ఈ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు.
అయినప్పటికీ సన్ రైజర్స్ మరి ఇతడిలో ఏం చూసిందో ఏమో..? రూ.30 లక్షలు పెట్టి వేలంలో కొనక్కుంది. తుది జట్టులోనూ ఆడించింది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై విఫలమైనా తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ పై 36 పరుగులు చేశాడు. తాజాగా ఆదివారం వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 41 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్స్ లు ఉన్నాయి.
అలవోకగా సిక్సులు కొడుతున్న అనికేత్ ను చూస్తే ఇతడు ఇంత టాలెంటా? అనిపిస్తుంటుంది. ఢిల్లీతో మ్యాచ్ లో అనికేత్ కాసేపు క్రీజులో ఉంటే సన్ రైజర్స్ మరింత మెరుగైన స్కోరు చేసేదే. ఇప్పుడు అందరూ సన్ రైజర్స్ ను ఒకే మాట అంటున్నారు.. అనికేత్ ను నాలుగో స్థానంలో పంపించాలని.
యూపీ-మధ్యప్రదేశ్ సరిహద్దులోని ఝాన్సీలో పుట్టిన అనికేత్.. దేశవాళీలో మధ్యప్రదేశ్ కు (ఒకే మ్యాచ్) ఆడాడు. ఇంతవరకు సీనియర్ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అండర్ 23 వన్డే టోర్నీలో కర్ణాటకతో జరిగిన మ్యాచ్ లో మధ్యప్రదేశ్ తరపున 75 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేయడంతో అనికేత్ వెలుగులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో 7 మ్యాచ్ లలో 16 సిక్సర్లతో 184 పరుగులు చేశాడు. 152.06 స్ట్రైక్ రేట్ కాగా సగటు 46. గత ఏడాది జూన్ లో మధ్యప్రదేశ్ లీగ్‌లో భోపాల్ లెపార్డ్స్ తరపున 6 ఇన్నింగ్స్ లలో 195.00 స్ట్రైక్ రేట్‌తో 273 పరుగులు చేశాడు. ఓ మ్యాచ్ లో 41 బంతుల్లో 13 సిక్సర్లతో 123 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తో టి20 మ్యాచ్ లో మధ్యప్రదేశ్ తరపున సీనియర్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ అయ్యాడు. 23 ఏళ్ల అనికేత్ ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.