ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య తేడా చెప్పిన పాక్ కోచ్
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు పాకిస్థాన్ నిరాశపరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు పాకిస్థాన్ నిరాశపరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో, నాకౌట్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాక్, ఆ తర్వాత టీమ్ ఇండియా చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో, లీగ్ దశలో చివరిగా బంగ్లాదేశ్‌తో తలపడబోయే పాక్, గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.
ఈ మ్యాచ్‌కు ముందు, పాక్ కోచ్ అకీబ్ జావేద్ మీడియాతో మాట్లాడాడు. భారత్ దుబాయ్‌లోనే మ్యాచ్‌లు ఆడడం వల్ల వారికి ప్రయోజనం కలుగుతుందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నా, తాము ఆ విషయాన్ని ఓటమికి కారణంగా చెప్పబోమని స్పష్టం చేశాడు.
'ఒక్క గ్రౌండ్‌లో ఆడటం టీమ్‌ఇండియాకు లాభం, కానీ మేము దాని వల్ల ఓడిపోలేదు' అని పాకిస్తాన్ కోచ్ స్పష్టం చేశారు. "ఇండియా భద్రతా కారణాలతో దుబాయ్ లో ఆడుతోంది. ఒకే గ్రౌండ్‌లో ఆడటం, ఒకే హోటల్‌లో ఉండటం వల్ల కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. కానీ మేము ఆ కారణంతో ఓడిపోలేదు. టీమ్ఇండియా దుబాయ్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన తర్వాత మాతో తలపడలేదు కదా" అని అకీబ్ పేర్కొన్నాడు.
భారత్ చేతిలో ఓటమి అనంతరం.. పాక్ జట్టుపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం జట్టుపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ విమర్శలపై కూడా అకీబ్ స్పందించాడు. టీమ్ ఇండియాతో ఓటమి వల్ల అభిమానులకంటే ఆటగాళ్లకే ఎక్కువ బాధ కలిగిందని, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేనందునే పరాజయం ఎదుర్కొవాల్సి వచ్చిందని వెల్లడించాడు.
"మేము జట్టును మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నాం. మరేమీ చేయలేం. ప్రస్తుత దృష్టి తదుపరి మ్యాచ్‌పైనే. అయితే, భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎప్పుడూ భావోద్వేగపూరితంగానే ఉంటాయి. అభిమానులు, మీడియా ఎంతగా ప్రతిస్పందించినా, ఆటగాళ్లు మరింత మానసిక ఒత్తిడికి గురవుతారు. భారత్ జట్టు అనుభవజ్ఞులతో నిండి ఉంది. కానీ మా జట్టులో అత్యధిక అనుభవం ఉన్న ఆటగాళ్లు తక్కువ. బాబర్ అజామ్ మాత్రమే 100కి పైగా మ్యాచ్‌లు ఆడాడు. మహ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్ వంటి కొంతమంది ఆటగాళ్లకు అనుభవం ఉన్నప్పటికీ, మిగతా ఆటగాళ్లు 30కంటే తక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవమే కలిగి ఉన్నారు" అని అకీబ్ వివరించాడు.
- భారత్‌కు ప్రత్యేక షెడ్యూల్, భద్రత కారణంగానే నిర్ణయం
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ దక్కించుకున్నప్పటికీ, టీమ్ ఇండియా తన మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడుతోంది. సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే జరగనుంది. అంతేకాక, భారత్ ఫైనల్‌కు చేరితే, ఆ మ్యాచ్ కూడా యూఏఈలోనే నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు. భద్రతా కారణాల వల్ల టీమ్ఇండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు భారత క్రికెట్ బోర్డు (BCCI) అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.