అశ్విన్ కు అవమానాలు..అందుకే రిటైర్మెంట్..తండ్రి సంచలన వ్యాఖ్యలు

అయితే, తన కుమారుడికి అవమనాలు ఎదురై ఉండొచ్చని, అందుకే అతడు రిటైర్మెంట్ ప్రకటించాడని అంటున్నాడు అశ్విన్ తండ్రి రవిచంద్రన్.

Update: 2024-12-19 20:30 GMT

టీమ్ ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు..? అది కూడా ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. మరో రెండు టెస్టులు ఆడాల్సి ఉండగా, రిటైర్మెంట్ ఇచ్చి స్వదేశానికి ఎందుకు వచ్చేస్తున్నాడు? జట్టులో అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో చోటు దక్కని అశ్విన్ ను.. రెండో టెస్టులో పట్టుబట్టి మరీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడించడంలో ఏదో విషయం దాగుందా..? తనను మూడో టెస్టులో ఆడించకపోవడంతో అశ్విన్ అవమానంగా భావించాడా? అందుకే రిటైర్మెంట్ ఇచ్చాడా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది.

మరో యోగరాజ్..

టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంగతి అందరికీ తెలిసిందే. తన కుమారుడు యువరాజ్ ను కెప్టెన్ గా ఉన్న ధోనీ తొక్కేశాడని ఆరోపిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే, ఇది వాస్తవం కాదని అందరికీ తెలిసి ఎవరూ పట్టించుకోరు. కాగా, ప్రస్తుతం అశ్విన్ తండ్రి కూడా ఇలాంటి ఆరోపణలే చేశాడు.

అవమానించారు.. అందుకే ఐదు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు అశ్విన్ ఎంపికైనా.. అన్ని మ్యాచ్ లలో అతడిని ఆడిస్తారని ఎవరూ భావించలేదు. దీనికితగ్గట్లే పేసర్ బుమ్రా సారథ్యం వహించిన తొలి టెస్టులో కుర్రాడు వాషింగ్టన్ సుందర్ కు చాన్స్ దక్కింది. రెండో టెస్టులో గులాబీ బంతితో కాబట్టి, కెప్టెన్ గా ఉన్న రోహిత్.. అశ్విన్ ను తీసుకున్నాడు. మూడో టెస్టులో వీరిద్దరినీ కాదని రవీంద్ర జడేజాను ఆడించారు. ఈ టెస్టు ముగిసే సరికి అశ్విన్ వీడ్కోలు నిర్ణయం ప్రకటించాడు. అయితే, తన కుమారుడికి అవమనాలు ఎదురై ఉండొచ్చని, అందుకే అతడు రిటైర్మెంట్ ప్రకటించాడని అంటున్నాడు అశ్విన్ తండ్రి రవిచంద్రన్. వాటిని తట్టుకోలేకే అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చాడని వ్యాఖ్యానించాడు. అశ్విన్ వైదొలగే విషయం తనకూ చెప్పలేదన్నాడు. అవమానాలే కాక ఇంకా కారణాలు కూడా ఉండొచ్చని పేర్కొన్నాడు. ఏమైనా.. అశ్విన్ వీడ్కోలు పలికినందుకు తనకు కొంత బాధ, కొంత సంతోషం అని రవిచంద్రన్ తెలిపాడు.

వాస్తవం ఇది..

38 ఏళ్ల అశ్విన్ స్వదేశంలో న్యూజిలాండ్ తో సిరీస్ లో సరిగా రాణించలేదు. ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించిన అతడు కివీస్ పై మూడు టెస్టుల్లో 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అశ్విన్ ఫామ్ లో ఉంటే ఒకే ఇన్నింగ్స్ లో తీసే వికెట్లివి. దీంతోనే అతడు తన కెరీర్ పై పునరాలోచనలో పడ్డాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో జట్టులో అవకాశం దక్కినా.. మరో రెండు టెస్టులే ఉండడం, అందులో ఆడించే అవకాశం లేకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించాడు. పైగా టీమ్ ఇండియాకు ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్ సిరీస్ వచ్చే జూన్ లో మొదలుకానుంది. అక్కడ అశ్విన్ అవసరం పెద్దగా లేదు. అందుకనే అతడు ఆట చాలించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News