సీనియర్లూ.. దేశవాళీలు ఆడాల్సిందే.. బీసీసీఐ అల్టిమేటం

భారత క్రికెట్ జట్టు సభ్యులైన చాలామంది డొమెస్టిక్ క్రికెట్ మొహం చూడక చాన్నాళ్లయింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా ఓటమితో దేశవాళీ క్రికెట్ ప్రస్తావన వచ్చింది.

Update: 2025-01-12 19:30 GMT

2012.. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి చివరి సారిగా రంజీట్రోఫీలు కానీ.. దేశవాళీ టోర్నీలు కానీ ఆడి. అంటే 12 ఏళ్లు దాటిపోయింది.

2015.. చివరిసారిగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్న సంవత్సరం.

వీరిద్దరే కాదు.. భారత క్రికెట్ జట్టు సభ్యులైన చాలామంది డొమెస్టిక్ క్రికెట్ మొహం చూడక చాన్నాళ్లయింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా ఓటమితో దేశవాళీ క్రికెట్ ప్రస్తావన వచ్చింది. స్టార్ కల్చర్ కు వీడ్కోలు పలికి నేల మీదకు దిగిరావాలనే విమర్శలు కూడా వచ్చాయి.

టీమ్ ఇండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉన్నారు. రోహిత్ అయితే మరో ఏడాది ఆడడం కూడా కష్టమే. చాంపియన్స్ ట్రోఫీతో అతడి కెరీర్ ముగిసినా ఆశ్చర్యం లేదు. కోహ్లి కూడా రెండేళ్లు కొనసాగుతాడేమో? అది కూడా ఫామ్ బాగుంటేనే.

ఇక బీసీసీఐ మాత్రం రోహిత్, కోహ్లి అనే కాదు సీనియర్ ఆటగాళ్లు అందరూ దేశవాళీలు ఆడాలని అల్టిమేటం ఇచ్చింది. పని భారంతో కుదరకపోతే అదే విషయాన్ని హెడ్ కోచ్ గంబీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కు తెలియజేయాలని సూచించింది. ఈ రూల్ ను పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేగాక పూర్తి ఫిట్ నెస్ తో ఉన్న ఆటగాళ్లనే జట్టులోకి ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఆ ఇద్దరి ధిక్కారంతో..

2023 చివర్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ అనంతరం మిడిలార్డర్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ లను దేశవాళీలు ఆడాలని బీసీసీఐ కోరగా వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత వారిని బీసీసీఐ కూడా పట్టించుకోవడం మానేసింది. తాజా ఆదేశాల ప్రకారం చూస్తే ఇక మీదట అందరికీ అదే వర్తించనుందని తెలుస్తోంది.

Tags:    

Similar News