విర్రవీగి పరువు పోగొట్టుకున్న బెన్ డకెట్.. మీమ్స్, ట్రోల్స్

కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు కనీసం సెమీ ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది.

Update: 2025-02-27 04:04 GMT

కాన్ఫిడెన్స్ ఉండాలి.. కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారితే ఏమవుతుందంటే ఇదిగో ఇంగ్లండ్ ఓపెనర్ ‘బెన్ డకెట్’లా నవ్వుల పాలవుతారు.. ఇండియా చేతిలో ఓడిపోగానే దాన్ని పెద్ద విషయం కాదని తేల్చి.. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియాను ఓడిస్తామని విర్రవీగిన బెన్ డకెట్ పరువుపోయింది. ఇండియాపై కాదు కదా.. కనీసం అప్ఘనిస్తాన్ పై కూడా గెలవకుండా చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్ అయిన ఇంగ్లండ్ ఓటమిని చూసి ఇప్పుడు అందరూ బెన్ డకెట్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు..


ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే తిరిగి కొట్టాయి. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు పరాజయాలు ఎదురైన తర్వాత డకెట్ మీడియా ముందుకు వచ్చి ధీమా వ్యక్తం చేశాడు. "మేం 3-0 తేడాతో ఓడినా పెద్ద విషయం కాదు. మేం ఇక్కడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చాం. భారతను ఫైనల్లో ఓడిస్తాం. అప్పుడు ఈ ఓటమిని ఎవరూ గుర్తుంచుకోరు" అని ఆయన ప్రకటించాడు.

కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు కనీసం సెమీ ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. గ్రూప్ దశలోనే అఫ్గానిస్తాన్ చేతిలో షాకింగ్ ఓటమి చెందడంతోనే ఇంగ్లండ్ జట్టు బలహీనత బయటపడింది. టోర్నమెంట్ మొత్తం నిలకడలేని ఆటతీరు ప్రదర్శించిన ఇంగ్లండ్, ఆఖరికి బి గ్రూపులో ముందుగా ఇంటిదారి పట్టిన జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది.

ఇదే విషయాన్ని పట్టుకుని నెటిజన్లు డకెట్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. "ఫైనల్లో భారతను ఓడిస్తామన్నావుగా.. ఫైనల్ ఎక్కడ ఉంది? సెమీస్ కూడా చేరలేకపోయావు!" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని మీమ్స్ అయితే మరింత క్రియేట్ చేస్తూ.. డకెట్ చేసిన వ్యాఖ్యలను చమత్కారంగా ఉపయోగిస్తూ వైరల్ చేస్తున్నారు.

ఇంగ్లండ్ జట్టు గతంలోనూ అంతర్జాతీయ టోర్నీలలో అంచనాలను అందుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి డకెట్ చేసిన అత్యుత్సాహమైన వ్యాఖ్యలే తిరిగి కొట్టినట్టయ్యాయి. ఈ పరాజయంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు పెద్ద గుణపాఠమే లభించిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఒకవేళ ఇంగ్లండ్ జట్టు భవిష్యత్తులో మంచి ప్రదర్శన చేయాలనుకుంటే.. గ్రౌండ్‌లోనే మాట్లాడటం మేలని అభిమానులు సూచిస్తున్నారు. ఇక డకెట్ వ్యాఖ్యలు నెటిజన్ల ట్రోలింగ్‌కు దారి తీసినా, క్రికెట్‌లో ఏదైనా జరిగే అవకాశమే ఉంటుందని, ఇది క్రీడాస్ఫూర్తిగా తీసుకోవాలని మరికొందరు అంటున్నారు.

Tags:    

Similar News