గాయంలో ప్రేమ గేయం.. పెళ్లి పీటలెక్కనున్న స్టార్ క్రికెటర్

కామెరూన్ గ్రీన్.. 25 ఏళ్ల ఈ కుర్రాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్. అన్ని ఫార్మాట్లలోనూ సుదీర్ఘ కాలం జట్టుకు ఆడగల ప్రతిభ ఉన్నవాడిగా పేరు తెచ్చుకున్నాడు.

Update: 2025-02-16 22:30 GMT

ఒక్కోసారి కష్టాలే మేలు చేస్తాయి.. కాస్తంత విశ్రాంతి దొరికి జీవితం గురించి ఆలోచన రేకెత్తించేలా చేస్తాయి.. ఇలాంటి అనుభవమే ఆస్ట్రేలియా యువ క్రికెటర్ కు ఎదురైంది.. కొన్నేళ్లుగా ఆల్ రౌండర్ గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అతడు అనూహ్యంగా గాయపడ్డాడు. దీంతో మొన్నటి భారత్ తో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)కి దూరమయ్యాడు. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకీ అందుబాటులో లేకుండా పోయాడు. అయితేనేం.. జీవితంలో ముఖ్యమైన అధ్యాయం ప్రారంభించనున్నాడు.


కామెరూన్ గ్రీన్.. 25 ఏళ్ల ఈ కుర్రాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్. అన్ని ఫార్మాట్లలోనూ సుదీర్ఘ కాలం జట్టుకు ఆడగల ప్రతిభ ఉన్నవాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే, గ్రీన్ ఇటీవల గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పటికే 28 టెస్టులు, 28 వన్డేలు, 13 టి20లు ఆడిన గ్రీన్.. గత రెండు సీజన్లలో ఐపీఎల్ జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ సభ్యుడు కూడా. గ్రీన్ ను 2024లో ఆర్సీబీ ఏకంగా రూ.17.50 కోట్లకు దక్కించుకోవడం విశేషం. అంతకుముందు ముంబై ఇండియన్స్ రూ.8 కోట్లకు తీసుకుంది. అయితే, వచ్చే సీజన్ కు గ్రీన్ వేలంలో పేరు నమోదు చేసుకోలేదు.


మహా పొడగరి..

పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన కామెరూన్ గ్రీన్ ఎత్తు 6 అడుగుల 6 అంగుళాలు. ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం ఉన్న దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సన్ ఎత్తు 6.8 అడుగులు. ఆ తర్వాత గ్రీన్ మాత్రమే అత్యంత పొడగరి. దీనిని ఉపయోగించుకునే అతడు మంచి బౌన్స్ రాబడతూ వికెట్లు తీస్తున్నాడు. భారీ హిట్టింగ్ చేయగలుగుతున్నాడు.

గ్రీన్ వెన్నుగాయంతో శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది, దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు మొత్తం ఐపీఎల్ సీజన్‌ కు దూరమయ్యాడు. మరోవైపు గ్రీన్ ఈ ఖాళీ సమయాన్ని ప్రేయసితో గడుపుతున్నాడు. ఆమెతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ అమ్మాయితో నా ప్రేమ శాశ్వతం అంటూ క్యాప్షన్ తో ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఆమె వేలికి రింగు తొడిగి మ్యారేజ్ ప్రపోజ్ చేయగా, అంగీకరించినట్లు తెలుస్తోంది.దీంతో గ్రీన్ కు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News