2017 టు 2025.. 8 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ.. కారణమేంటి?
ఈ నెల 19 నుంచి పాకిస్థాన్ ఆతిథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో నిర్వహిస్తారు.
వన్డే ఫార్మాట్ లో ప్రపంచ కప్ తర్వాత పెద్ద టోర్నీ అంటే చాంపియన్స్ ట్రోఫీనే.. ఎపుడు 1998లో ప్రారంభమైన ఈ టోర్నీ 27 ఏళ్లలో 8 సార్లే జరిగింది.. గత టోర్నీకి ప్రస్తుత టోర్నీకి ఏకంగా 8 ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఈ నెల 19 నుంచి పాకిస్థాన్ ఆతిథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో నిర్వహిస్తారు.
2017లో చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగలింది. లీగ్ దశలో పాకిస్థాన్ ను అలవోకగా ఓడించిన మన జట్టు ఫైనల్లో అదే జట్టు చేతిలో అనూహ్యంగా ఓడింది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీనే నిర్వహించలేదు. మళ్లీ ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్ పాక్ గడ్డపైనే టోర్నీ జరుగుతోంది.
టాప్ 8 టీమ్ లు బరిలో దిగుతున్న ఈ టోర్నీకి 8 ఏళ్లు గ్యాప్ ఎందుకు వచ్చిందనే ప్రశ్న ఎదురవుతోంది. అయితే, వన్డే ఫార్మాట్ కు ఆదరణ తగ్గుతోంది. అలాంటిది ఉండగానే.. 1998లో చాంపియన్స్ ట్రోఫీని మొదలుపెట్టింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). అప్పటికి టి20లు లేవు. దీంతో వన్డే ప్రపంచ కప్ తో పాటు రెండేళ్లకొకసారి చాంపియన్స్ ట్రోఫీ తలపెట్టింది.
1998లో బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వగా టోర్నీని దక్షిణాఫ్రికా గెలుచుకుంది. అప్పట్లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా పిలిచినా 2002లో చాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. శ్రీలంకలో జరిగిన 2002లో టోర్నీలో టైటిల్ ను భారత్, శ్రీలంక సంయుక్తంగా గెలుచుకున్నాయి.. ఇప్పటివరకు ఎనిమిదిసార్లు టోర్నీ జరగ్గా భారత్, ఆస్ట్రేలియా రెండేసి సార్లు గెలిచాయి. సొంతం చేసుకున్నాయి. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న పాకిస్థాన్ ఆతిథ్యంలోనే ట్రోఫీ జరగనుంది. 2017 ఎడిషన్ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది.
2006 వరకు రెండేళ్లకోసారి సాగిన చాంపియన్స్ టోర్నీ తర్వాత మూడు, నాలుగేళ్లకు మారిపోయింది. ఇప్పుడు ఏకంగా ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు. దీనికి కారణం.. వన్డే వరల్డ్ కప్ లో టాప్ టీమ్ లు ఆడతాయి. మళ్లీ ఇదే ఫార్మాట్ లో మరో టోర్నీ ఎందుకని 2017 తర్వాత చాంపియన్స్ ట్రోఫీని నిలిపేశారు.
2019లో వన్డే ప్రపంచ కప్, 2021లో టి20 ప్రపంచ కప్, 2023లో వన్డే ప్రపంచ కప్.. ఇలా వరుస టోర్నీలు జరిగాయి. దీంతో 2021లో చాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిలిపేసింది. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్ విస్తరణ కోసం మళ్లీ మొదలుపెట్టింది.