టెస్టు క్రికెట్ లో శతాబ్దంలో తొలిసారి.. ఇంగ్లండ్ రికార్డుల మోత

టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో జట్టు 800 పైగా స్కోరు చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. ఇందులో మూడుసార్లు ఇంగ్లండ్ ఉండడం విశేషం.

Update: 2024-10-11 06:00 GMT

శభాష్ ఇంగ్లండ్.. టెస్టులకు బజ్ బాల్ క్రికెట్ పరిచయం చేసిన ఆ జట్టు.. విదేశంలో ఆడుతూ అద్భుతం చేసింది.. పాపం పాకిస్థాన్.. సొంతగడ్డంపై తొలిసారి బంగ్లాదేశ్ కు టెస్టు సిరీస్ కోల్పోయింది.. అదికూడా తొలి టెస్టులో చరిత్రలో తొలిసారి పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.. ఆ పరాభవం నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరింత దారుణంగా ఓడిపోతోంది.. పైగా తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 500 పైగా పరుగులు చేసినప్పటికీ ఓటమిని తప్పించుకోలేకపోతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ దెబ్బకు పాక్ జట్టు పరిస్థితి తలకిందులైంది. ఇప్పుడు ఇంగ్లండ్ పైనా ఓడితే ఎలా ఉంటుందో?

ఒకే టెస్టు.. సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్

పాకిస్థాన్ లోని ముల్తాన్ లో ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్-పాక్ టెస్టు చిరస్మరణీయం అనడంలో సందేహం లేదు. ఇది టెస్టు మ్యాచ్

చరిత్రలో 2553వ మ్యాచ్‌. ఇందులో ఇంగ్లాండ్‌ రికార్డులు బద్దలుకొట్టింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 556 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), సల్మాన్ ఆగా (104) సెంచరీలు కొట్టారు. బదులుగా ఇంగ్లండ్ పరుగుల వానతో హోరెత్తించింది. మిడిలార్డర్‌ బ్యాటర్లు జో రూట్‌ (262; 375 బంతుల్లో 17×4), హ్యారీ బ్రూక్‌ (317; 322 బంతుల్లో 29×4, 3×6) ఏకంగా డబుల్, ట్రిపుల్‌ సెంచరీలు కొట్టేశారు. గురువారం నాలుగో రోజు ఓవర్‌ నైట్‌ స్కోరు 492/3తో ఆట కొనసాగించిన ఇంగ్లాండ్‌.. 150 ఓవర్లలో 823/7 వద్ద డిక్లేర్‌ చేసింది. గురువారం 49 ఓవర్లలోనే 331 పరుగులు బాదేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ లో పాక్ పై 267 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ లో పాక్ బ్యాటర్లు విఫలమయ్యారు.

800పైగా నాలుగో సారి మాత్రమే..

టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో జట్టు 800 పైగా స్కోరు చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. ఇందులో మూడుసార్లు ఇంగ్లండ్ ఉండడం విశేషం. భారత్ పై 1997లో శ్రీలంక 952/6 కు డిక్లేర్ చేసింది. ఇదే ఇప్పటివరకు అత్యధిక స్కోరు. ఇక 1938లో ఇంగ్లండ్‌ 903/7 డిక్లేర్డ్‌ (ఆస్ట్రేలియాపై), 1930లో 849 ఆలౌట్‌ (వెస్టిండీస్‌) స్కోర్లు చేసింది. అయితే, 2000 సంవత్సరం తర్వాత టెస్టుల్లో ఒక జట్టు 800 స్కోరు అధిగమించడం ఇదే మొదటి సారి.

అరుదైన ట్రిపుల్..

టెస్టుల్లో అరుదుగా కనిపించే ట్రిపుల్ సెంచరీని ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ (317) సాధించాడు. ట్రిపుల్ కొట్టిన 20వ బ్యాటర్ గా నిలిచాడు. ఇంగ్లండ్‌ తరఫున ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఆరో బ్యాట్స్ మన్. రూట్, బ్రూక్‌ నాలుగో వికెట్‌ కు జోడించిన 454 పరుగులు టెస్టుల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యుత్తమ భాగస్వామ్యం. సుదీర్ఘ ఫార్మాట్‌ చరిత్రలో నాలుగోది. 2006లో దక్షిణాఫ్రికాపై కుమార సంగక్కర, మహేల జయవర్దనె 624 పరుగుల రికార్డు పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు. ఇక ఇంగ్లండ్ తో తాజా టెస్టులో ఆరుగురు పాకిస్థాన్ బౌలర్లు 100 పైగా పరుగులు ఇచ్చారు. 2004లో జింబాబ్వే (శ్రీలంకపై) జట్టు బౌలర్లు మాత్రమే ఇంత భారీగా పరుగులిచ్చారు.

కొసమెరుపు: పాకిస్థాన్- ఇంగ్లండ్ తొలి టెస్టుకు శుక్రవారం ఐదో రోజు. ప్రస్తుతం పాకిస్థాన్ 80 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్ ఆగా, ఆమేర్ జమాల్ పోరాడుతున్నారు. మరో రెండు సెషన్లు వీరు నిలదొక్కుకుంటే డ్రా అవుతుంది. అలా జరిగినా పాక్ పరాభవం తప్పించుకున్నట్లే.

Tags:    

Similar News